Brian Lara : అంతర్జాతీ క్రికెట్లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) ఓ శిఖరం. అంతేనా.. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడి పరుగుల వరద పారించిన మేటి ఆటగాడు. ఇక 22 అడుగుల పిచ్ మీద లారా బద్ధలు కొట్టిన రికార్డులకు కొదవే లేదు. అతడి తర్వాత ఎందరో గొప్ప క్రికెటర్లుగా కీర్తి గడించినా.. టెస్టుల్లో లారా నెలకొల్పిన ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. అయితే.. సుదీర్ఘ ఫార్మాట్లో తాను నెలకొల్పిన 400 పరుగుల మైలురాయిని భారత యువ కెరటాలు అధిగమిస్తారని విండీస్ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్.. ఈ ఇద్దరిలో ఒకరు టెస్టుల్లో నాలుగొందలు కొట్టేసి.. నా అధిగమిస్తారని లారా జోస్యం పలికాడు. ‘మా కాలంలో చాలామంది నన్ను సవాల్ చేస్తూ 300లకు పైగా కొట్టారు. వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్యలు చాలా దూకుడుగా ఆడేవాళ్లు.
అయితే.. ఈతరంలో అంత ధాటిగా ఆడేవాళ్లు అరదే. భారత జట్టులో యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్లు.. ఇంగ్లండ్ టీమ్‌లో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్‌లు మాత్రమే ధనాధన్ ఆడుతున్నారు. వీళ్లలో ఏ ఒక్కరైనా మారథాన్ ఇన్నింగ్స్ ఆడితే.. నా ఆల్‌టైమ్ రికార్డు నా పేరిట ఉండదు’ అని లారా వెల్లడించాడు.
ఇంగ్లండ్‌తో అంటిగ్వాలో జరిగిన ఆఖరి టెస్టులో లారా ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన అతడు టెస్టు క్రికెట్లోనే అత్యధిక స్కోర్ బద్ధలు కొట్టాడు. వ్యక్తిగత స్కోర్ 400 నాటౌట్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ విధ్వంసంతో అప్పటిదాకా ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ పేరిట ఉన్న 380 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఇప్పటికీలో 24 ఏండ్లు గడుస్తున్నా లారా రికార్డు మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు.
ఫ్యాబ్ 4గా పేరొందిన విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్.. వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు సైతం లారా రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేదు. దాంతో, ఇక టీ20ల యుగం రాజ్యమేలుతున్న ఈ కాలంలో కరీబియన్ మాజీ సారథి క్వాడ్రబుల్ సెంచరీని బ్రేక్ చేసే ఆటగాడిని ఊహించడం పెద్ద సాహసమే. కానీ, లారా మాత్రం ఏ రికార్డు శాశ్వతం కాదని.. భారత కుర్రాళ్లు గిల్, యశస్వీలకు తన రికార్డును బద్దలు కొట్టగల దమ్ము ఉందని భావిస్తున్నాడు.