Sivaramakrishnan : భారత క్రికెట్ (Indian Cricketer) లో ఒకప్పుడు అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరిగా పేరుగాంచిన లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ (Laxman Shivaramakrishnan) .. తన కెరీర్‌ను ప్రభావితం చేసిన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు. తనపై జరిగిన వర్ణ వివక్ష, జాత్యహంకార వ్యాఖ్యలు తనను మానసికంగా ఎంతగా కుంగదీశాయో తాజాగా తెలియజేశారు. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు.
తనకు పద్నాలుగేళ్ల వయసులో ఎదురైన ఓ సంఘటనను శివరామకృష్ణన్ గుర్తుచేసుకున్నాడు. చెపాక్
స్టేడియంలో టీమిండియాకు నెట్ బౌలర్‌గా వెళ్లినప్పుడు.. స్కూల్ యూనిఫాంలో ఉన్న తనను ఓ సీనియర్
భారత బ్యాటర్ గదిలోకి పిలిచారని శివరామకృష్ణన్ తెలిపారు. గ్రౌండ్ సిబ్బందిలో ఒకడిగా భావించి, తన బూట్లు శుభ్రం చేయమని ఆ ఆటగాడు ఆదేశించాడని చెప్పారు. ఆ మాటకు నిశ్చేష్టుడైన తాను.. ‘అది నా పని కాదు, మీ పని మీరు చూసుకోండి’ అని బదులిచ్చినట్లు తెలిపాడు.
అప్పుడు జాతి వివక్ష అంటే ఏమిటో తెలియకపోయినా ఆ ఆటగాడి ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఎల్ శివరామకృష్ణన్ అన్నారు. ఇలాంటి అవమానాలు తన కెరీర్లో చాలాసార్లు ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తమిళనాడు జట్టులో ఆడుతున్నప్పుడు కొందరు ప్రముఖ ఆటగాళ్లు తనను ‘కరుపా (నల్లటి వాడు)’ అని పిలిచేవారని చెప్పాడు. ముంబై, చండీగఢ్, జలంధర్ వంటి నగరాల్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ప్రేక్షకులు ‘కాలియా, తేరా క్యా హోగా (నల్లోడా, నీ గతేంటి)’ అంటూ ఎగతాళి చేసేవారని గుర్తుచేసుకున్నాడు.
తన 17వ పుట్టినరోజున జరిగిన మరో ఘటన తనకు కన్నీళ్లు తెప్పించిందని శివరామకృష్ణన్ తెలిపారు.
ఆ రోజు తన కోసం తెచ్చిన చాక్లెట్ కేక్‌ను చూపిస్తూ ఓ సీనియర్ ఆటగాడు.. ‘హే సన్నీ.. నువ్వు సరైన రంగు
కేకే ఆర్డర్ చేశావ్. ఇంత నల్లటి అబ్బాయికి ఇలాంటి డార్క్ చాక్లెట్ కేకే కరెక్ట్’ అని ఎగతాళిగా అన్నాడని
గుర్తుచేశారు. ఆ మాటలతో తాను ఏడుస్తూ కేక్ కట్ చేయడానికి నిరాకరించానని, అప్పుడు దిగ్గజ
ఆటగాడు సునీల్ గవాస్కర్ తనను ఓదార్చడంతో కన్నీళ్లతోనే కేక్ కట్ చేశానని ఆనాటి బాధను
పంచుకున్నాడు.
ఈ ఘటనలన్నీ తన మనసుపై చెరగని ముద్ర వేశాయని శివరామకృష్ణన్ అన్నారు. తన కెరీర్ ఆశించిన
స్థాయిలో సాగకపోవడానికి ఇవి కూడా కారణమయ్యాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.