లక్నో: రాపిడో డెలివరీ వ్యక్తి ఒక మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె రిప్లై ఇచ్చింది. అయితే ఫిర్యాదు చేసుకోమని ఆ వ్యక్తి సవాల్ చేశాడు. ఆ మహిళ పోస్ట్‌పై రాపిడో స్పందించింది. చాలా తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. (I Love You Text Mesage to Woman) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. రాపిడో డెలివరీ వ్యక్తి తనకు అనుచితమైన సందేశం పంపాడని నోయిడాకు చెందిన గీతిక శ్రీవాస్తవ ఆరోపించారు. తొలుత ఆమె ఎలా ఉన్నారని అతడు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ‘ఐ లవ్ యు’ అని సందేశం పంపాడు. ‘మళ్లీ కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని గీతిక వార్నింగ్ ఇచ్చింది. ‘అవునా.. చేసుకో, రాపిడోలో ఫిర్యాదు చెయ్యి’ అని అతడు రిప్లే ఇచ్చాడు.
కాగా, రాపిడో డెలివరీ వ్యక్తి అనుచిత మెసేజ్‌ల స్క్రీన్షాట్లను లింక్డిన్లో గీతిక షేర్ చేసింది. ఆ యాప్ సేవలను ఉపయోగించేటప్పుడు కస్టమర్ల గోప్యత, మహిళల భద్రత, వృత్తిపరమైన హద్దుల గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒక డెలివరీ వ్యక్తికి తన వ్యక్తిగత కాంటాక్ట్ వివరాలు ఎలా లభించాయని ప్రశ్నించారు. ‘ఈ దేశంలో మహిళగా ఉండటం కష్టమైన విషయం. కానీ ఇప్పుడు ‘రాపిడో’ ద్వారా ఒక పార్శిల్ డెలివరీని బుక్ చేసుకుంటే చాలు, డెలివరీ సిబ్బంది వేధింపులకు వారు గురికావాల్సి వస్తోంది. ఫిర్యాదు చేసుకోమని చెప్పడంలో అతడికి ఎంత ధీమా ఉందో చూడండి. అంటే దీనివల్ల అతనికి ఎలాంటి శిక్షా పడదా? అసలు ఎలాంటి రైడర్లను ఆ సంస్థ నియమించుకుంది?’ అని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు గీతిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాపిడో దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఆ మహిళకు క్షమాపణలు చెప్పింది. ‘మీ పార్సెల్ డెలివరీలో మీరు ఎదుర్కొన్న అసహ్యకరమైన అనుభవం గురించి తెలుసుకుని మేం చింతిస్తున్నాము. ఆ కెప్టెన్ ప్రవర్తన గురించి మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. ఇటువంటి విషయాలను మేం చాలా తీవ్రంగా పరిగణిస్తాం. వినియోగదారుల భద్రత, గౌరవం, మర్యాద మాకు అత్యంత ప్రాధాన్యతలు’ అని రాపిడో పేర్కొంది.