మెల్బోర్న్: టాపార్డర్ చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా 189 పరుగులకు ఆలౌటైంది. 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును కైల్ వెరీనె (52), మార్కో జాన్సెన్ (59) అర్ధశతకాలతో ఆదుకున్నారు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన ఈ ఆల్‌రౌండర్ వేగానికి స్వింగ్‌ను జోడిస్తూ ప్రొటీస్‌ను దెబ్బకొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా సోమవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఆతిథ్య ఆసీస్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 144 పరుగులు వెనుకబడి ఉంది. ఖవాజా (1) ఔట్ కాగా.. వార్నర్ (32), లబుషేన్ (5) క్రీజులో ఉన్నారు. ఇరు జట్ల మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.