ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)కి రంగం సిద్ధమైంది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో మేటి జట్లుగా వెలుగొందుతున్న భారత్, ఆస్ట్రేలియా కదనరంగానికి సై అంటున్నాయి. పేస్‌కు స్వర్గధామైన పెర్త్ పిచ్‌పై టెస్టు వార్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. గత రెండు సార్లు ఆసీస్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన టీమ్ఇండియా..ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడాలని చూస్తున్నది. రోహిత్‌శర్మ, గిల్, షమీ గైర్హాజరీలో బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత్ ఒకింత ఒత్తిడిలో కనిపిస్తున్నది. సొంత ఇలాఖాలో తమకెదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు కంగారూలు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. యాషెస్‌ను తలదన్నే రీతిలో జరిగే బీజీటీ సిరీస్‌లో ఆధిపత్యం ఎవరిదో చూడాలి.
BGT | పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో భారత్, ఆస్ట్రేలియా తొలి పోరుకు వేళయైంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీసకు తెరలేవనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఓవైపు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌తో భారత్ ఒత్తిడిలో ఉంటే.. చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై ఆసీస్ టెస్టు సిరీస్ ఆడబోతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమ్ఇండియా..
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)నకు అర్హత సాధించాలంటే ఆసీస్‌పై ప్రతీ మ్యాచ్ కీలకం కాబోతున్నది. దీనికి తోడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ లేకుండానే టీమ్ఇండియా పెర్త్ టెస్టు ఆడబోతున్నది. రెండో సంతానం కోసం స్వదేశంలోనే ఉండిపోయిన రోహిత్..మూడో రోజు ఆట నాటికి జట్టుతో చేరనున్నాడు. బుమ్రా సారథ్యంలో భారత్..ఆసీస్‌కు చెక్ పెడుతుందా లేక కివీస్‌పై పేలవఫామ్‌ను కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గత రెండు పర్యాయాలు టీమ్ఇండియా చేతిలో అనూహ్య సిరీస్ ఓటములు ఎదుర్కొన్న ఆసీస్ ఈసారి మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నది.
ఆసీస్‌తో తొలి టెస్టుకు టీమ్ఇండియా తుది కూరుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఓవైపు ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ శుభ్‌మన్‌గిల్ దూరం కాగా, కెప్టెన్ రోహిత్‌శర్మ రెండో టెస్టుకు జట్టులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం లభిస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గాయం నుంచి తేరుకున్న రాహుల్..జైస్వాల్ జతగా ఓపెనింగ్ దిగే చాన్స్ కనిపిస్తున్నది. ఇదే జరిగితే మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్‌కు రావచ్చు. మిడిలార్డర్లో ధృవ్ జురెల్, సర్ఫరాజ్‌ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది.
ఆస్ట్రేలియా ‘ఏ’తో అనధికారిక టెస్టుల్లో జురెల్ ఆకట్టుకోగా, సర్ఫరాజ్ నిలకడలేమి టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి టెస్టు అరంగేట్రం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. పేస్‌కు సహకరించే పెర్త్ పిచ్‌పై నితీశ్ ఆల్‌రౌండ్ సేవలు జట్టుకు బాగా ఉపయోగపడనున్నాయి. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు తోడు బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్సింగ్కు నితీశ్ జత కలిస్తే ఆసీస్‌ను అడ్డుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఏకైక స్పిన్నర్ కోటాలో అశ్విన్ జట్టులోకి రావచ్చు.
సొంతగడ్డపై భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న ఆసీస్‌కు బౌలింగ్ బలంగా ఉండగా, బ్యాటింగ్ విభాగం కలవరపెడుతున్నది. వార్నర్ లేకుండా ఆడుతున్న ఆసీస్..యువ బ్యాటర్ మెక్స్వీనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఖవాజా జతగా మెక్‌స్వీని ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. దీనికి తోడు ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో స్మిత్ సగటు 36 కాగా, లబుషేన్ సగటు గత రెండేండ్లలో 30 కంటే పడిపోయింది. మెగాటోర్నీల్లో భారత్‌కు విలన్‌గా మారిన హెడ్ సగటు కూడా తక్కువ(28)గానే ఉంది. మిడిలార్డర్లో హెడ్, మార్ష్, క్యారీ, కమిన్స్ ఎలా రాణిస్తారనే దానిపై ఆసీస్ ఆధిక్యం ఆధారపడి ఉంది. బ్యాటింగ్ కంటే కంగారూల బౌలింగ్ బలంగా ఉంది. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్ త్రయం.. భారత్‌కు ప్రమాదకరం కానుంది. వీరు చెలరేగితే ఆసీస్ కల నెరవేరినట్లే. ఈ త్రయానికి వెటరన్ స్పిన్నర్ లియాన్ జత కలిస్తే.. ఆ జట్టుకు తిరుగుండదు.
భారత్: జైస్వాల్, రాహుల్, పడిక్కల్, కోహ్లీ, పంత్, జురెల్, నితీశ్‌రెడ్డి, అశ్విన్, హర్షిత్రానా/ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్/ఆకాశ్‌దీప్, బుమ్రా(కెప్టెన్)
ఆస్ట్రేలియా: ఖవాజా, మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, కమిన్స్(కెప్టెన్), లియాన్, హాజిల్‌వుడ్