Sourav Ganguly Biopic : భారత లెజెండరీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) జీవిత కథ వెండి తెరపై ఆవిష్కృతం కానుంది. హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. తొలుత విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) లీడ్ రోల్ పోషిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే. ఏమైందో తెలియదు ఆయుష్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడు. దాంతో, నిర్మాణ సంస్థ ప్రధాన పాత్ర కోసం మరో నటుడి వేట మొదలెట్టింది.
గంగూలీకి మంచి స్నేహితుడు అయిన ప్రొసెంజిత్ ఛటర్జీ(Prosenjit Chatterjee) బయోపిక్‌లో నటిస్తాడని సమాచారం. బెంగాలీ నటుడైన ప్రొసెంజిత్ ఈ పాత్రకు చక్కగా సరిపోతాడని భావిస్తున్నారు. భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన దాదా జీవిత కథను డైరెక్టర్ లువ్ రంజన్ (Luv Ranjan) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ప్రొసెంజిత్ ఛటర్జీ
‘బెంగాల్‌కు చెందిన మాజీ క్రికెటర్ గంగూలీ పాత్ర పోషించేందుకు మొదట ఆయుష్మాన్ ఖురానా ఆసక్తి చూపించాడు. అయితే ఇప్పుడు అతడు చిత్రం నుంచి వైదొలిగాడు. దాంతో, దాదా జీవిత కథలో బెంగాలీ నటుడిని తీసుకోవాలని నిర్మాత లువ్ రంజన్ భావిస్తున్నాడు. ప్రొసెంజిత్ ఎంపిక దాదాపు పూర్తయిందని సమాచారం అని ఓ మీడియా కథనం వెల్లడించింది.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన గంగూలీ జట్టుకు దూకుడు నేర్పాడు. సచిన్ టెండూల్కర్ జతగా ఇన్నింగ్స్ ఆరంభించి ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లండ్ గడ్డపై నాట్‌వెస్ట్ ట్రోఫీ (Nat West Trophy) విజయం గంగూలీ కెరీర్లో మరుపురానిది. భారత్‌కు ఎక్కువ విజయాలు అందించిన రెండో సారథి దాదానే.
గంగూలీ నేతృత్వంలో ఇండియా 146 వన్డేల్లో 76 విజయాలు నమోదు చేసింది. 49 టెస్టుల్లో 21 మ్యాచుల్లో భారత్‌ను గెలుపు తోవ తొక్కించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంగూలీ ఐపీఎల్‌లోనూ మెరిశాడు. ఆ తర్వాత బీసీసీఐ 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా కొనసాగుతున్నాడు.