భువనేశ్వర్: తెలంగాణ యువ ఫుట్‌బాలర్ గుగులోతు సౌమ్య ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఇందూరులో పుట్టి అంచలంచెలుగా ఎదిగిన సౌమ్య..అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) వార్షిక అవార్డుల్లో భాగంగా ‘బెస్ట్ వుమన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు విజేతగా నిలిచింది. శుక్రవారం భువనేశ్వర్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సౌమ్య.. ఏఐఎఫ్ఎఫ్ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది.
తెలంగాణ నుంచి బెస్ట్ వుమన్ ఫుట్‌బాలర్ అవార్డు దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 2021లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఈ 23 ఏండ్ల నిజామాబాద్ అమ్మాయి ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లాడి 5 గోల్స్ చేసింది. నేషనల్ టీమ్‌కే గాకుండా దేశంలో ప్రముఖ క్లబ్‌లుగా వెలుగొందుతున్న ఈస్ట్‌బెంగాల్, గోకులం కేరళ లాంటి జట్లకు సౌమ్య ప్రాతినిధ్యం వహించి సత్తాచాటుతున్నది.
సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన సౌమ్య..ప్రస్తుతం భారత జట్టుకు మిడ్‌ఫీల్డర్‌గా కీలక సేవలు అందిస్తున్నది. ఏఐఎఫ్ఎఫ్ అత్యున్నత పురస్కారం సాధించిన సౌమ్యను సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు మోహన్‌బగాన్ సూపర్‌జెయింట్స్ డిఫెండర్ సుభాశిష్ బోస్ ‘బెస్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కైవసం చేసుకున్నాడు.