వెల్లింగ్టన్: వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. చివరిది, మూడోది అయిన మరో మ్యాచ్ అనంతరం రెండు జట్లు వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి.
ఇదిలావుంటే ఇవాళ జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. కేవలం 51 బంతుల్లో 111 పరుగులు రాబట్టి టీ20 కెరీర్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. పైగా భారత జట్టు సునాయాస విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, యాదవ్ ఆటతీరుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముగ్ధుడయ్యాడు.
సూర్యకుమార్ స్టైల్ ఆటతీరును తాను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. అతని ఇన్నింగ్స్ పూర్తిగా భిన్నమని పేర్కొన్నాడు. సూర్యకుమార్ కొట్టిన షాట్లలో కొన్నింటిని తాను మునుపెన్నడూ చూడలేదని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అని ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.