ముంబై: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో తొలి అంచె సెమీఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీ అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 1-0తో టేబుల్ టాపర్ ముంబై సిటీ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు తరఫున స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛెత్రీ 78వ నిమిషంలో సూపర్ గోల్ చేశాడు.
మ్యాచ్‌లో బంతిని ఎక్కువ శాతం(58) తమ ఆధీనంలో ఉంచుకున్న ముంబై.. బెంగళూరు డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైంది. నాకౌట్లో అదరగొడుతున్న బెంగళూరు మరోమారు మెరిసింది. కార్నర్లో రోషన్ నుంచి పాస్ అందుకున్న ఛెత్రీ గోల్ చేయడంతో బెంగళూరు సంబురాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో అంచె సెమీస్ మ్యాచ్ ఈ నెల 12న బెంగళూరులో జరుగుతుంది.