SMAT | సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి బెంగాల్ జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ, ఆకాశ్ దీప్‌లను జట్టులో చోటు దక్కింది. రంజీ తొలి దశలో నాలుగు మ్యాచుల్లో షమీ 20 వికెట్లు పడగొట్టాడు. పాదం గాయం నుంచి కోలుకున్న తర్వాత.. షమీ ఈ సీజన్లో బెంగాల్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఆడాడు. ఉత్తరాఖండ్, గుజరాత్‌లపై బెంగాల్ వరుసగా గెలిచిన తొలి రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్తో పాటు షమీ కూడా బెంగాల్ జట్టుకు ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహిస్తాడు. షమీ చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. సెలక్టర్లు అతన్ని తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు షమీని జట్టులోకి తీసుకోలేదు. అయితే, దేశీయ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులోకి రావాలని షమీ భావిస్తున్నాడు. ‘రంజీ ట్రోఫీ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. ఫిట్‌గా ఉండడం నా మోటివేషన్. భారత జట్టుకు అందుబాటులో ఉండడమే తప్ప.. సెలెక్టర్లకు ఫిట్నెస్ అప్డేట్స్ ఇవ్వడం తన పనికాదు’ అంటూ వ్యాఖ్యానించాడు. బెంగాల్ జట్టులో రైజింగ్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ తరఫున ఆడిన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ అభిషేక్ పోరెల్ సైతం చోటు దక్కించుకున్నాడు. రెండవ వికెట్ కీపర్‌గా షకీర్ హబీబ్ గాంధీ సైతం ఉన్నాడు. ఈ T20 టోర్నమెంట్లో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో బరోడాతో తమ మొదటి మ్యాచ్ ఆడనున్నారు. ఈ గ్రూప్‌లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్, పుదుచ్చేరి, హర్యానా ఉన్నాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి బెంగాల్ జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), యువరాజ్ కేస్వానీ, ప్రియాంషు శ్రీవాస్తవ, షాబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, రితిక్ ఛటర్జీ, కరణ్ లాల్, సక్షమ్ చౌదరి, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, సయాన్ ఘోష్, కనిష్క్ సేథ్, యుధాజిత్ గుహ, శ్రేయాన్ చక్రవర్తి.