ఇంగ్లండ్ క్రికెట్లో మరో సంచలనం. ఆ దేశ టెస్టు జట్టు సారధి బెన్ స్టోక్స్.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. కొన్నిరోజుల క్రితమే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్ పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ వార్తను ఇంకా మర్చిపోకముందే స్టోక్స్ కూడా సంచలన నిర్ణయం వెల్లడించి అభిమానులకు షాకిచ్చాడు.
ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్టోక్స్ పెద్దగా రాణించలేదు. అయితే న్యూజిల్యాండ్, టీమిండియా జట్లతో జరిగిన టెస్టుల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. రూట్ నుంచి టెస్టు కెప్టెన్సీ అందుకున్న అతను.. ఇంగ్లండ్ టెస్టు జట్టు ఆటతీరును మార్చేశాడు. కానీ వన్డే క్రికెట్లో ఆ ప్రతిభ చూపించలేకపోయాడు.
ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని, మంగళవారం నాడు డర్హమ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే వన్డే తనకు చివరిదని స్టోక్స్ ప్రకటించాడు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. నా సహచరులతో ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. కానీ ఈ ఫార్మాట్లో నా వందశాతం ఇవ్వలేకపోతున్నాననేది వాస్తవం. దానికన్నా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడమే మంచిదని అనిపించింది.
ఆటగాడి నుంచి వందశాతం కన్నా ప్రదర్శన ఏమాత్రం తగ్గినా వాళ్లు ఇంగ్లండ్ జట్టు జెర్సీకి అర్హులు కాదు’’ అని స్టోక్స్ ట్విట్టర్లో వెల్లడించాడు. ఇంగ్లండ్ తరఫున 104 వన్డేలు ఆడిన స్టోక్స్.. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022