BCCI : మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరనుంది. వేలంలో పాల్గొంటున్న కంపెనీలు ద్వారా రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. వేలం పాట జనవరి 25న జరగనుంది. మొత్తం 30 కంపెనీలు వేలంలో పోటీపడుతున్నాయి. వీటిలో పది ఫ్రాంఛైజీలు పురుషుల ఐపీఎల్ జట్లు ఉన్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే రూ.5 లక్షలు పెట్టి వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాలు తీసుకున్నాయి. వేలంలో జట్ల కోసం కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు అంచనా. మహిళల ఐపీఎల్‌కు జనాదరణ బాగానే ఉంది. కొందరు రూ.800 కోట్ల వరకు వేలం పాడే అవకాశం ఉంది. అని పురుషుల ఐపీఎల్ జట్ల వేలంలో పాల్గొన్ననిపుణుడు వెల్లడించాడు. మీడియా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐపీఎల్ మహిళా టీమ్‌లను దక్కించుకున్న సంస్థలకు బీసీసీఐ పంచనుంది. అంతేకాదు సెంట్రల్ పూల్ పార్ట్నర్షిప్ నుంచి కొంత భాగాన్నిఇవ్వనుంది. టీమ్ స్పాన్సర్షిప్ ద్వారా సంస్థలకు ఆదాయం రానుంది.
వేలంలో పెద్ద కంపెనీలు
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో మహిళల జట్టను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. అవసరమైతే భారీ ధర పెట్టి అయినా టీమ్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాయి. అదానీ గ్రూప్, టారెంట్ గ్రూప్, హల్దీరామ్ ప్రభూజీ, కాప్రి గ్లోబల్, కొటక్ అండ్ ఆదిత్య బిర్లా వంటి పెద్ద కంపెనీలు మహిళల ఐపీఎల్ జట్టను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మహిళల ఐపీఎల్ ముంబైలో మార్చి నెలలో జరగనుంది. ఐదేళ్ల కాలానికి వైకోమ్ సంస్థ మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను రూ.951 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.