BCCI | భారత మాజీ ఆటగాడు అన్షుమన్ గైక్వాడ్‌కు బీసీసీఐ ఆర్థిక సాయం ప్రకటించింది. గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గైక్వాడ్‌కు రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని బీసీసీఐ కార్యదర్శి జైషా అపెక్స్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు గైక్వాడ్ కుటుంబంతో మాట్లాడి యోగక్షేమాల గురించి ఆరా తీశారు. గైక్వాడ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. చికిత్స ఎలా జరుగుతుందో తెలుసుకుంటున్నట్లు తెలిపింది. ఈ కఠిన సమయంలో టీమిండియా మాజీ ఆటగాడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బోర్డు హామీ ఇచ్చింది.
1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్, సందీప్ పాటిల్ సహా పలువురు మాజీ క్రికెటర్లు గైక్వాడ్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో గైక్వాడ్‌కు సహాయం చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. గైక్వాడ్ చికిత్స కోసం మాజీ సహచరులు మొహిందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని కపిల్ వెల్లడించాడు.
గైక్వాడ్ టీమిండియా తరఫున 1975 నుంచి 1987 క్రికెట్ ఆడాడు. భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత 1997 నుంచి 1999 వరకు, 2000లో భారత జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. అనిల్ కుంబ్లే పాకిస్తాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఘనతను సాధించిన సమయంలో గైక్వాడ్ భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. గైక్వాడ్ నాయకత్వంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ డ్రా అయ్యింది.