ముంబై: భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ కుదించనుందా? జూన్ నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకాబోయే ఐదు టెస్టుల సిరీస్ నుంచి హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్‌లో పలువురు కోచ్‌లకు ఉద్వాసన పలుకనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ప్రస్తుతం గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అభిషేక్ నాయర్‌తో పాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
శనివారం (మార్చి 29న) గువహటిలో జరుగబోయే బీసీసీఐ సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. బ్యాటింగ్ కోచ్‌గా ఇప్పటికే సితాన్షు కోటక్ ఉండగా అభిషేక్ అవసరం లేదన్న భావనలో బోర్డు ఉండగా దిలీప్ స్థానాన్ని మరో అసిస్టెంట్ కోచ్ రియాన్ డస్కటే నిర్వర్తించే అవకాశమున్నట్టు వినికిడి. మరి దీనికి గంభీర్ ఆమోదం తెలుపుతాడా? అనేది ఆసక్తికరం. కోచ్‌ల కుదింపుతో పాటు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులపైనా ఈ సమావేశంలో చర్చ జరుగనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.