Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ భవితవ్యంపై బీసీసీఐ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందా..? పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌ను సాగనంపాలా..? లేక మరికొన్నేండ్లపాటు కొనసాగించాలా..? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ రోహిత్‌తో చర్చించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. వన్డే వరల్డ్ కప్‌లో ఓటమి తర్వాత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం ఇదే విషయమై రోహిత్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్ ఆ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. పూర్తిగా వన్డేల మీదే దృష్టి సారించిన రోహిత్.. టీ20లలోకి మళ్లీ వచ్చేది అనుమానమే. అయితే టీ20 వరల్డ్ కప్ – 2024లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువభారత్తో ఆడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీసీసీఐ.. రోహిత్‌ను తిరిగి ఈ ఫార్మాట్లో ఆడించేది కష్టమే. అదీగాక వచ్చే ఏడాది భారత్ మొత్తంగా ఆరు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ పూర్తిగా టెస్టుల మీదే దృష్టి సారించనున్నాడని సమాచారం.
వచ్చే ఏడాది భారత్ ఆడే వన్డేలు తక్కువగా ఉండటంతో రోహిత్‌నే కొనసాగిస్తే బెటర్ అన్న అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి. 2027లో జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ ఆడేది కల్లే అయినా కనీసం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకైనా అతడిని కొనసాగించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. హార్ధిక్ పాండ్యా గాయాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ రెండేండ్లలో రోహిత్ తన వారసుడిని తయారుచేసుకున్నాకే వన్డేల నుంచి తప్పుకుంటే బెటర్ అని అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై రోహిత్ అభిప్రాయం ఎలా ఉంది..? అతడు పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటాడా..? అన్నది త్వరలోనే తేలనుంది. భారత జట్టు డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆ లోపు భారత జట్టు పరిమిత ఓవర్ల సారథిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.