Arjuna Award 2023: భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక క్రీడా అవార్డులలో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును ఈ ఏడాది టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దక్కించుకోబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా సిఫారసు చేసినట్టు సమాచారం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో షమీ.. ఏడు మ్యాచ్‌లలోనే 24 వికెట్లను తీసిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించినవారిలో షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న షమీ.. న్యూజిలాండ్‌తో ధర్మశాల వేదికగా ముగిసిన మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శనలతో రాణించాడు. భారత్ ఫైనల్ చేరడంలో షమీది కీలక పాత్ర. వరల్డ్ కప్ తర్వాత విరామం తీసుకుంటున్న షమీ.. త్వరలోనే సౌతాఫ్రికా వేదికగా జరగాల్సి ఉన్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 26 న తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది.
Mohammed Shami’s name has been recommended for Arjun Award after his performance in World Cup 2023. [ANI] pic.twitter.com/aC67RaoMFr
— Johns. (@CricCrazyJohns) December 13, 2023
ఇక క్రీడా అవార్డుల విషయానికొస్తే.. 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ఏడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున ఇతర అవార్డుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎఎం ఖన్విల్కర్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు క్రికెట్ ఆడుతున్నవారిలో విరాట్ కోహ్లీ (2013), అశ్విన్ (2014), రోహిత్ శర్మ (2015), అజింక్యా రహానే (2016), రవీంద్ర జడేజా (2019)లు అర్జున అవార్డు దక్కించుకున్నవారిలో ఉన్నారు. ఇషాంత్ శర్మ 2020వ సంవత్సరంలో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.