హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : మెల్బోర్న్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు రావాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌ను శాలువాతో సత్కరించి రజతోత్సవ వేడుకల ఆహ్వాన పత్రిక అందజేశారు.
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఆహ్వానంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి రజతోత్సవాలకు కేటీఆర్ హాజరు కానుండడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు కేటీఆర్‌ను ఆహ్వానించిన వారిలో నాయకులు అభినయ్ కనపర్తి, సంతోష్‌రెడ్డి, శ్రీవేకర్రెడ్డి, లక్ష్మణ్ నల్లాన్, యుగంధర్‌రెడ్డి అల్లం, సాయిరాం రెడ్డి, వెంకట్‌సాయి తెనుగు, తదితరులు ఉన్నారు.