ముంబై: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ కొన్ని గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీనిపై ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా రచ్చరచ్చ చేస్తోంది. ఐపీఎల్ వల్లే ఇలా చేశారని, అసలు రవిశాస్త్రిని బుక్‌లాంచ్ ఈవెంట్‌కు ఎవరు వెళ్లమన్నారని అక్కడి మీడియా నానా నిందలూ వేస్తోంది. అయితే తాజాగా ఈ మ్యాచ్ రద్దవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ద టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన ఆయన.. ప్లేయర్స్ ఆడటానికి సుముఖంగా లేరన్న విషయం నిజమేనని చెప్పారు. ప్లేయర్స్ ఆడటానికి నిరాకరించారు. కానీ వాళ్లను కూడా ఈ విషయంలో నిందించలేం. ఫిజియో యోగేశ్ పార్మర్ అప్పటికే ప్లేయర్స్‌తో టచ్‌లో ఉన్నాడు. నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్లోకి వెళ్లిన తర్వాత యోగేశ్ ఒక్కడే మిగిలిపోయాడు. యోగేశ్ ప్రతి రోజూ ప్లేయర్స్ మసాజ్ చేసేవాడు. అతనికి కరోనా సోకిందని తెలియగానే ప్లేయర్స్ ఆందోళనకు గురయ్యారు. తమకూ కరోనా సోకుతుందని భయపడ్డారు అని గంగూలీ వెల్లడించారు.
బబుల్‌లో ఉండటం అంత తేలికైన విషయం కాదని కూడా ఈ సందర్భంగా దాదా అన్నారు. ప్లేయర్స్ ఫీలింగ్స్‌ను మనం అర్థం చేసుకోవాలి. ఈ మ్యాచ్ వల్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నష్టపోయిన విషయం తెలుసు. కానీ ముందు ఈ గందరగోళం తొలగిపోతే తర్వాత ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సిరీస్ ఇక ముగిసిపోయింది. వచ్చే ఏడాది ఎప్పుడు ఆ టెస్ట్ ఆడినా.. అది ఏకైక మ్యాచ్ సిరీస్ అవుతుంది. ఈ నెల 22న నేను లండన్ వెళ్తున్నాను. మ్యాచ్‌లను వాయిదా వేయడం అంత సులువు కాదు. భవిష్యత్తులో మళ్లీ ఇలా జరగదు అని గంగూలీ స్పష్టం చేశారు.