BCCI : మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో జరగాల్సిన ఈ మెగా టోర్నీకి బంగ్లాదేశ్ (Bangladesh) ఆతిథ్యమివ్వాలి. కానీ, గత కొన్ని రోజులుగా ఆందోళనలతో అడ్డుకుతున్న బంగ్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వరల్డ్ కప్ వేదికను తరలించే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే బీసీసీఐని ఐసీసీ సంప్రదించింది. అయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఐసీసీకి హ్యాండిచ్చింది.
నిరుడు సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ నిర్వహించిన బీసీసీఐ వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. అందుకనే ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకనే ఏమాత్రం మొహమాటపడకుండా మా వల్ల కాదని ఐసీసీకి బీసీసీఐ తెగేసి చెప్పేసింది.
‘ఇప్పుడు మన దగ్గర వర్షాలు బాగా పడుతున్నాయి. అంతకంటే ముఖ్యమైన విషయం.. వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్ నిర్వహించబోతున్నాం. ఈ పరిస్థితుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తామని చెప్పలేను. ఒకవేళ అంగీకరించామంటే.. వరసగా రెండు వరల్డ్ కప్‌లను నిర్వహించాల్సి ఉంటుంది’ అని సెక్రటరీ జై షా (Jai Shah) స్పష్టం చేశాడు. దాంతో, బీసీసీఐపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఐసీసీ మళ్లీ వేదిక వేట మొదలెట్టనుంది. ఏదేశం ముందుకురాని పరిస్థితుల్లో ఈసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో.. దుబాయ్‌లో టోర్నీని నిర్వహించే అవకాశముంది.