సినిమా పేరు : మిస్టర్ బచ్చన్
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు, తనికెళ్ల భరణి..
దర్శకత్వం: హరీశ్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్.
రవితేజ, హరీశ్‌శంకర్ కాంబినేషన్ సినిమా అనగానే ఆడియన్స్‌లో ఆటోమేటిగ్గా ‘మిస్టర్ బచ్చన్’పై అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. ప్రచారంలో ఈ సినిమా పాటలు, స్టిల్స్, టీజర్లు, ట్రైలర్లు ఓ వైబ్‌ని క్రియేట్ చేశాయి. ఇంతటి అంచనాల నడుమ విడుదలైన రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ అందరి అంచనాలను అందుకున్నదా? లేదా? అనేది తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ : బచ్చన్ (రవితేజ) నిజాయితీ గల ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్. ఆ నిజాయితీ వల్లే అతను సస్పెండ్ అయ్యాడు. తన సొంతూరెళ్లిపోయి కుమార్సానూ ఆర్కెస్ట్రా నడుపుకుంటూ తల్లిదండ్రులతో, స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. అక్కడే అతనికి జిక్కీ(భ్యాగ్యశ్రీ బోర్సే) పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇదిలావుంటే.. పేరుమోసిన దుర్మార్గుడు, ఆ ప్రాంత ఎంపీ అయిన జగ్గయ్య(జగపతిబాబు) తమ్ముడి రాజకీయ అరంగేట్రం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కరెంట్ కోసమని జగ్గయ్య మనుషులు బచ్చన్ ఇంటిపై పడతారు. అడ్డుకున్న బచ్చన్ తల్లిదండ్రులను గాయపరుస్తారు. విషయం తెలుసుకున్న బచ్చన్.. ఆ బహిరంగ సభ సాక్షిగానే ఆ తప్పుకు కారకుడైన జగ్గయ్య తమ్ముడితో తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పించాడు. ఇంతలో బచ్చన్‌కీ, జిక్కీకి పెళ్లి ఖాయం అయింది. మరోవైపు వైపు తన తమ్ముడికి జరిగిన అవమానం తెలిసి జగ్గయ్య రగిలిపోతుంటాడు. ఇంకోవైపు బచ్చన్‌కి మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావల్సిందని పై అధికారుల నుంచి ఫోన్ వస్తుంది. జగ్గయ్య మనుషులు బచ్చన్ కోసం వెతుకుతున్నారు. బచ్చన్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జగ్గయ్య ఇంటిపై ఐటీ రైడ్ నిర్వహించాలనే బాధ్యత తొలి అసైన్మెంట్గా పడింది. తన టీమ్‌తో జగ్గయ్య ఇంటిపై సోదాకు వెళతాడు బచ్చన్. వెతకుతున్న బచ్చన్ ఐటీ అధికారిగా తన ఇంటిపైకే ఐటీ దాడి జరపడానికి రావడంతో జగ్గయ్య ఖంగుతుంటాడు. మరి జగ్గయ్య ఇంటిని బచ్చన్ దిగ్విజయంగా రైడ్ చేశాడా? ఆ రైడ్ ఆపడానికి జగ్గయ్య చేసిన ప్రయత్నాలేంటి? చివరికి బచ్చన్ ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఒక బలమైన విలన్.. అతడ్ని ఎదిరించే వాడు లేడా? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక హీరో ఎంట్రీ.. సినిమా ఆద్యంతం విలన్ ఎత్తులకు హీరో పై ఎత్తులు.. చివరకు హీరో విజయం. ఇప్పటికీ కొన్ని వేల సినిమాలొచ్చాయి ఈ కథతో. ఓ విధంగా చెప్పాలంటే రొడ్డకొట్టుడు కథ. దీనికి 90s నేపథ్యాన్ని జోడించి, కాస్త కలర్‌ఫుల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఇక ఈ కథను విశ్లేషిస్తే.. విలన్ అనేవాడు ఎంత దుర్మార్గుడో అనేది ముందు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాలి. వాడిపై ఆడియన్స్‌కి కూడా కోపం తెప్పించాలి. తర్వాత హీరో వాడిపై గెలుస్తుంటే, వాడిని కొడుతుంటే ఆడియన్స్ ఇగో శాటిస్వై అవ్వాలి. ఎప్పుడైతే ఆడియన్స్ ఇగో శాటిస్వై అయ్యిందో ఆ సినిమా బంపర్‌హిట్. ఈ కథలో అసలు జగపతిబాబు పోషించిన జగ్గయ్య పాత్రపై ఆడియన్స్‌కి ఏ మాత్రం కోపం రాదు. తన జోలికొచ్చే వారిపై జులూం చూపించడం తప్ప, అనవసరంగా ఎవరినీ ఆ పాత్ర ఇబ్బంది పెట్టదు. అలాంటప్పుడు హీరో అతనిపై గెలుస్తుంటే ఆడియన్స్‌కి ప్రత్యేకంగా ఆనందం ఎందుకుంటుంది?. ఇక ఈ సినిమాలో సెకండ్ ప్రయారిటీ హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ. ప్రేమ అంటే కౌగిలించేసుకోవడం, ముద్దులుపెట్టేసుకోవడం, ఏడ్చేసుకోవడం.. అన్నట్టుగా చూపించాడు మన దర్శకుడు హరీశ్‌శంకర్. పైగా 60కి చేరువ అవుతున్న రవితేజను అంత రొమాంటిక్‌గా చూపించాల్సిన అవసరం లేదనుకుంట. సినిమా ప్రథమార్ధం అంతా అమితాబ్ పాత సినిమాల పాత్రల ఇమిటేన్స్, 90s లోని కుమార్సానూ పాటలు, కిశోర్‌కుమార్ పాటలు, అక్కడక్కడ చిరంజీవి పాటలు, అక్కినేని పాత సినిమా స్టెప్పులు.. ఇలా సినీ నాస్ట్రాలజీపై సాగిపోతుంది. ఇంటర్వెల్ దాకా అసలు కథ మొదలవ్వదు. ద్వితీయార్థం అంతా రైడింగే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా ప్రధామార్థం అంతా హరీశ్‌శంకర్ సినిమా.. ద్వితాయార్ధం అంతా ‘రైడ్’ సినిమా.
ఎవరెలా చేశారు:
సాధారణంగా ఏమీ లేని సినిమాను కూడా తన పెర్ఫార్మెన్స్తో నిలబట్టగల ప్రతిభాశాలి రవితేజ ఈ సినిమాను కూడా ఒంటి చేత్తో మోసి, స్వతహాగా తనకున్న ఈజ్‌తో జోష్‌తో సినిమాకు బలాన్ని చేకూర్చాడు. భాగ్యశ్రీ బోర్సే చాలా అందంగా ఉంది. తొలి సినిమా అయినా చక్కగా నటించింది కూడా. పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జగపతిబాబు షరామామూలే. ఇక పాత్రధారులంతా పరిథిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా..
మిక్కీ జే.మేయర్ పాటలు బావున్నాయి. ఆర్.ఆర్. చెప్పుకునే స్థాయిలో లేదు. కెమెరా వర్క్ బావుంది. ఇక దర్శకుడి విషయానికొస్తే.. ‘రైడ్’ కథకు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మార్పులు, కూర్పులు బాగానే చేశాడు గానీ.. 90s వాతావరాణాన్ని చూపించడానికి చేసిన ప్రయత్నంలో కన్ఫ్యూజన్ ఉంది. కాసేపు అమితాబ్ ‘దీవార్’ కటౌట్లు చూపిస్తారు. కాసేపు చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్’ పోస్టర్లు చూపిస్తారు. అసలు ఇది ఏ టైమ్ సినిమా అనే ఒక క్లారిటీకి రావడానికి ఆడియన్‌కి కాస్త టైమ్ పడుతుంది. ఏదైమైనా నాటి వాతావరణం, ఆ పాటలు ఆడియన్స్‌కి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. మొత్తంగా రవితేజ మార్క్ మాస్ మసాలాతో సినిమాను బాగానే తీశాడు హరీశ్‌శంకర్. కేవలం ఊర సినిమాను ఇష్టపడే వారికైతే ఈ సినిమా బాగానే నచ్చుతుంది.
బలాలు :
రవితేజ పెర్ఫార్మెన్స్, భాగ్యశ్రీబోర్సే గ్లామర్,
బలహీనతలు :
కథనం, ద్వితీయార్థం..
రేటింగ్: 2.5/5