అమరావతి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్షనేత అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వైఎస్ జగన్ ఎక్స్ వేదిక ద్వారా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు స్వాతంత్య్రమని బానిస సంకెళ్లు తెంచుకున్న రోజు ,స్వేచ్ఛా వాయువులు పంచిన రోజని గుర్తు చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళి అర్పిస్తున్నట్లు వెల్లడించారు.