ముంబై : మాజీ క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్(Padmakar Shivalkar) మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 2025 మార్చి 3వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారు. భారత దేశవాళీ క్రికెట్లో శివాల్కర్.. మేటి స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు. అద్భుతమైన నైపుణ్యం ఉన్న బౌలర్‌గా ఆయన తన కెరీర్లో రాణించారు. ఓ దశలో రంజీ ట్రోఫీలో చాలా కీలకమైన బౌలర్‌గా నిలిచారు. ముంబై తరపున శివాల్కర్ 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో ఆయన 19.69 సగటుతో 589 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో మేటి స్పిన్నర్‌గా శివాల్కర్ తన పాత్రను పోషించారు. 1972-73 రంజీ ఫైనల్లో శివాల్కర్ తన తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు ఇచ్చి 8 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తమిళనాడుపై ముంబై అద్భుతమైన విజయం నమోదు చేసింది.
రంజీల్లో దిగ్విజయంగా రాణించినా.. శివాల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడలేదు. స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ సమయంలోనే శివాల్కర్ క్రికెట్ ప్రస్థానం జరిగింది. ఆ సమయంలో ఉత్తమ బ్యాటర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టాడు శివాల్కర్. 2017లో బీసీసీఐ ఆయనకు కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేసింది.
ఓ నిజమైన లెజెండ్‌ను కోల్పోయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో ఆయన మాస్టర్ అని పేర్కొన్నారు. ముంబై తరపున ఆయన అందించిన సేవల్ని మరిచిపోలేమన్నారు. కుటుంబసభ్యలకు ఆయన సానుభూతి ప్రకటించారు.ముంబై క్రికెట్లో శివాల్కర్ చరగని ముద్ర వేసినట్లు బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
The BCCI mourns the unfortunate demise of Shri Padmakar Shivalkar.https://t.co/cOujyQfNzo
— BCCI (@BCCI) March 4, 2025