న్యూఢిల్లీ: భారత ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో రానున్న మూడున్నరేండ్లకు కోచ్ కోసం బీసీసీఐ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 ఆఖరి తేదీగా ప్రకటించింది.
‘చీఫ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో దరఖాస్తులను పూర్తిగా పరిశీలిస్తాం. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసి తుది జాబితాను వెల్లడిస్తాం’అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 60 ఏండ్ల లోపు ఉండి జాతీయ జట్టు తరఫున 30 టెస్టులు లేదా 50 వన్డేలు, రెండేండ్ల పాటు కోచ్‌గా అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా బోర్డు పేర్కొంది.