న్యూఢిల్లీ: టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని బీసీసీఐ(BCCI) సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ప్రధాన కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ నిర్వర్తిస్తున్నాడు. అయితే జూన్ చివరి నాటికి అతని పదవీకాలం ముగియనున్నది. అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ అతనికి చివరి టోర్నీ కానున్నది. అయితే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 27 చివరి తేదీ. మీడియా ప్రకటనలో బీసీసీఐ ఈ విషయాన్ని తెలిపింది.
సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నామని, ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయని, అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేస్తామని ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎంపికైన హెడ్ కోచ్ జూలై ఒకటో తేదీ నుంచి బాధ్యతలను చేపడుతాడు. 2027, డిసెంబర్ 31వ తేదీ వరకు కొత్త కోచ్ తన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యర్థి వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. కనీసం అతను 30 టెస్టు మ్యాచ్‌లు, 50 వన్డేలు ఆడి ఉండాలి. టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టుకు కనీసం రెండేళ్లూ పూర్తి స్థాయి సభ్యుడిగా ఉండి ఉండాలి. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే, ఆయన కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. లాంగ్ టర్మ్ కోచ్ కోసం ఎదురుచూస్తున్నామని, కనీసం మూడేళ్లు కోచింగ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని ఇటీవల షా వెల్లడించారు.
జూలైలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌తో కొత్త కోచ్ బాధ్యతలు మొదలవుతాయి. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఉంటాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్తారు. 2025లో పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. ఆ తర్వాత ఏడాది ఇండియా, శ్రీలంక దేశాలు టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో సౌతాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు కూడా కొత్త కోచే ఉంటాడు. కోహ్లీ, రోహిత్ కెరీర్లు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. కొత్త కోచ్ ఆ ఇద్దర్ని స్థానాలను ఫిక్స్ చేయాల్సిన బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది.
🚨 News 🚨
The Board of Control for Cricket in India (BCCI) invites applications for the position of Head Coach (Senior Men)
Read More 🔽 #TeamIndiahttps://t.co/5GNlQwgWu0 pic.twitter.com/KY0WKXnrsK
— BCCI (@BCCI) May 13, 2024