నల్లగొండ సిటీ, డిసెంబర్ 19 : కళాశాల భవనం పైనుండి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన నల్లగొండ పట్టణ సమీపంలోని చర్లపల్లిలో గల సోషల్ వేల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండలం జోగిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిని గురుకుల డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. శుక్రవారం కళాశాల భవనం మూడో అంతస్తు పైనుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్రంగా గాయపడగా తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే స్పందించి చికిత్స కోసం నల్లగొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విద్యార్థిని సూసైడ్ లేఖలో పేర్కొన్నట్లు, భవనం పై నుండి దూకేది కళాశాలలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మెడ, తలపై గాయాలున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు.