హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీజీ20 లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆమోదం తెలిపింది. 8 ఫ్రాంచైజీలతో జూన్‌లో ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ లీగ్ అద్భుతమైన వేదికగా నిలువనుంది.
అట్టడుగు స్థాయి నుంచి క్రికెట్‌ను ప్రోత్సహించడం, స్థానిక క్రీడాకారులకు ప్రొఫెషనల్ అవకాశాలను కల్పించడం లీగ్ ముఖ్య ఉద్దేశమని హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.జీవన్ రెడ్డి తెలిపారు. ఎంతో పారదర్శకంగా, ఉన్నత ప్రమాణాలతో ఈ లీగ్‌ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. లీగ్ మంజూరుకు సహకరించిన దేవజిత్ సైకియాతో పాటు బోర్డు సభ్యులకు ఈ సందర్భంగా హెచ్‌సీఏ ధన్యవాదాలు తెలిపింది. లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్, ఫ్రాంచైజీలు, క్రీడాకారుల రిజిస్ట్రేషన్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు పేర్కొంది.