లక్నో: ఐపీఎల్లో లక్నోతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఆ మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించిన లక్నో సూపర్ గెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాతీ(Digvesh Singh Rathi)కి .. బీసీసీఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన తర్వాత .. అతని వద్దకు వెళ్లి లెటర్ రైటింగ్ సంకేతం చేస్తూ బ్యాటర్‌ను అవమానించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాతీకి జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆ టార్గెట్‌ను మరో 22 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ అందుకున్నది. కేవలం రెండు వికెట్లు మాత్రమే ఆ జట్టు కోల్పోయింది. పంజాబ్ జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ 69, శ్రేయాస్ 52, వదేరా 43 రన్స్ చేశారు. ఐపీఎల్‌లోని ఆర్టికల్ 2.5 కింద లెవల్ 1 రూల్‌ను ఉల్లంఘించినట్లు లక్నో బౌలర్ దిగ్వేశ్ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన ఫీజును అతను ఆమోదించాడు. మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో షార్ట్ బంతిని పుల్ షాట్ ఆడబోయిన ఆర్యా క్యాచ్ అవుట్ అయ్యాడు. టాప్ హెడ్జ్ తీసుకున్న ఆ బంతిని .. మిడాన్ నుంచి వచ్చి శార్దూల్ అందుకున్నాడు. 9 బంతుల్లో 8 రన్స్ చేసి ఔటైన తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో.. ఆర్యా వద్దకు లెటర్ రాస్తున్నట్లు సంకేతం చేశాడు. గతంలో ఇద్దరూ ఢిల్లీ టీ20 లీగ్‌లో ఒకే జట్టు తరపున ఆడారు. అయితే దిగ్వేశ్ చేసిన సంకేతాన్ని.. వెస్టిండీస్ పేసర్ కిస్రిక్ విలియమ్స్ చేసిన నోట్‌బుక్ సంకేతంతో పోల్చారు. 2019 సిరీస్‌లో కోహ్లీని ఔట్ చేసిన సమయంలో కిస్రిక్ ఇలాగే సంకేతం ఇచ్చాడు.