దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో ఇటీవల భారత్‌తో ముగిసిన మ్యాచ్‌లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్‌తో పాటు హరీస్ రవూఫ్‌పై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదుచేసింది. బుధవారం రాత్రి బీసీసీఐ.. ఈ మెయిల్ ద్వారా ఐసీసీకి లేఖ రాసింది.
మ్యాచ్ సందర్భంగా అర్ధశతకం తర్వాత ఫర్హాన్ బ్యాట్‌ను గన్ పేలుస్తున్నట్టు చూపించగా రవూఫ్.. ఆపరేషన్ సింధూర్‌లో భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చివేశామంటూ 6 అంకెను చూపాడు. దీనిపై ఈ ఇద్దరూ రాతపూర్వక సమాధానం ఇవ్వకుంటే మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది.