ముంబై: ఐపీఎల్లో పలువురు ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో (గర్ల్‌ఫ్రెండ్స్) చెట్టాపట్టాలేసుకొని తిరగడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి టాప్ క్రికెటర్లు ప్రియురాళ్లను జట్టు బస్సుల్లో, హోటళ్లల్లో తమ వెంటే తీసుకెళ్తున్నారు. వారిలో కొందరు ఇన్ఫ్ల్లూయెన్సర్లు ఉన్నారు.
వాళ్లు గతంలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. దీనివల్ల జట్టు వ్యూహాలు, ఫిట్నెస్ అప్డేట్స్, ఇతర సున్నితమైన సమాచారం బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అలాగే, స్నేహితురాళ్ల కోసం జట్టు బస్సులు వేచి ఉండటం వల్ల షెడ్యూల్స్ దెబ్బతినడం, కొన్ని సందర్భాల్లో వివాదాలు తలెత్తడం బోర్డు దృష్టికి వచ్చింది. ‘దీన్ని ఇక్కడితో ఆపకుంటే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరు అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) అధికారులు అఫీషియల్ గర్ల్‌ఫ్రెండ్ అనే కారణాన్ని చూపిస్తూ హోటళ్లలో ఉండటానికి అనుమతిస్తున్నారు.
అసలు ఈ నియమం ఎక్కడి నుంచి వచ్చిందో మేం విచారించాలి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల వెంట వారి భార్యలు, కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంది’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో ఈ గర్ల్‌ఫ్రెండ్ సంస్కృతికి చెక్ పెడుతూ ఇకపై ఐపీఎల్‌తో పాటు భారత జట్టు అంతర్జాతీయ పర్యటనల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని కూడాబీసీసీఐ డిసైడైనట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఇకపై బస్సులు, హోటళ్లలో ఆటగాళ్ల స్నేహితురాళ్లకు ఎలాంటి ప్రవేశం ఉండదు. కేవలం భార్య, కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలపై రాబోయే బోర్డు సమావేశంలో చర్చించి ఏసీయూకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.