BCCI Apex Council | బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్నది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో జైషా స్థానంలో కొత్త కార్యదర్శి నియామకం అంశాన్ని చేర్చకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో జరుగనున్న బోర్డు 93వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు జరుగనున్న చివరి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇదే. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎంజీఎంలో బీసీసీఐ కార్యదర్శిగా పూర్తిస్థాయి బాధ్యతల నుంచి జై షా బాధ్యతల నుంచి వైదొలగనప్పటికీ.. నామినేషన్ ప్రక్రియపై చర్చించే అంశాన్ని జెండాలో చర్చలేదు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ప్రధానంగా బైజూ కేస్ అప్డేట్పై చర్చించనున్నారు.
టీమిండియా మాజీ టైటిల్ స్పాన్సర్ బైజూతో బీసీసీఐకి వివాదం నడుస్తున్నది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నది. ఎడ్టెక్ సంస్థ గత ఏడాది మార్చిలో బీసీసీఐతో స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. బెంగళూరుకు చెందిన కంపెనీ మార్చి 2019లో మూడేళ్ల జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందంపై బీసీసీఐతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించింది. సెప్టెంబర్ 2022 వరకు చెల్లింపులు జరిగాయి. అయితే, అక్టోబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు బకాయిలపై వివాదం కొనసాగుతున్నది. అలాగే, బెంగళూరులో అత్యాధునిక వసతులతో నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవం అంశంపై సైతం చర్చించనున్నారు. ఎన్సీఏ ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం కాంప్లెక్స్‌లో కొనసాగుతున్నది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంశంపై సైతం అపెక్స్ కౌన్సిల్లో బీసీసీఐ చర్చించనున్నది.