వేసవిలో క్రికెట్ మజాను అందించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. దేశంలోని 13 నగరాలలో ఏకంగా 65 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే ఈ క్రికెట్ పండుగకు మార్చి 22న తెరలేవనుంది. అంతర్జాతీయ క్రికెట్ స్టార్లతో కలిసి దేశవాళీ యువ సంచలనాలు మెరుపులు మెరిపించబోయే ఈ క్యాష్ రిచ్ ఈవెంట్లో తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరుగనుంది. ఈసారి హైదరాబాదీలకు ‘డబుల్’ బొనాంజా. లీగ్ మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లకూ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండటం గమనార్హం.
IPL | ముంబై: ధనాధన్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2025 షెడ్యూల్ వచ్చేసింది. కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం సాయంత్రం ఐపీఎల్-18వ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్ వేదికగా మార్చి 22న మొదలై రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించే ఈ మెగా టోర్నీ.. అదే మైదానంలో మే 25న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో 18వ సీజన్‌కు తెరలేవనుంది. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న సొంత గ్రౌండ్ (ఉప్పల్)లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. కాగా లీగ్ దశలో హైదరాబాద్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఒక్కమ్యాచ్ లేకపోవడం ఇక్కడి కోహ్లీ అభిమానులకు కాస్తంత నిరాశే!
బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్
సీజన్ ఆరంభమే బ్లాక్‌బస్టర్ ఆరంభం దక్కేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. తొలి మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తలపడనుండగా మార్చి 23న మొదటి డబుల్ హెడర్‌లో భాగంగా ఉప్పల్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ X రాజస్థాన్ తలపడతాయి. అదే రోజు రాత్రి ఐపీఎల్ అభిమానులు ‘ఎల్‌క్లాసికో’గా పిలుచుకునే చెన్నైXముంబై ఢీకొననున్నాయి. ఇక 24న ఢిల్లీXలక్నో, గుజరాత్Xపంజాబ్ తమ టైటిల్ వేటను ప్రారంభించనున్నాయి. చెన్నై, ముంబై మధ్య ఏప్రిల్ 20న రెండో మ్యాచ్ జరుగుతుంది.
10 జట్లు.. 2 గ్రూపులు.. 14 మ్యాచ్‌లు
టోర్నీలో పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఉండగా గ్రూప్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ప్రతి గ్రూపులోని జట్టు.. అదే గ్రూపులోని ఇతర జట్లతో తలా రెండు మ్యాచ్‌లు ఆడనుండగా ప్రత్యర్థి గ్రూపులోని ఉన్న ఒక జట్టు (సీడింగ్ ప్రకారం)తో మినహా మిగిలిన నాలుగు జట్లతో తలా ఒక మ్యాచ్ ఆడుతుంది. ఉదాహరణకు ఎస్ఆర్హెచ్.. గ్రూప్-1లో కేకేఆర్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా బెంగళూరు, రాజస్థాన్, చెన్నై, పంజాబ్‌తో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది.
హైదరాబాద్‌లో నాకౌట్ మ్యాచ్‌లు
65 రోజుల పాటు దేశంలోని 13 వేదికలలో 74 మ్యాచ్‌లు (70 లీగ్, 4 ప్లేఆఫ్స్)గా జరుగబోయే ఈ పొట్టి క్రికెట్ సంరంభంలో భాగంగా ఇరు తెలుగు రాష్ర్టాలకు ఈసారి క్రికెట్ మజా రెండింతలు కానుంది. హైదరాబాద్‌లో ఏడు లీగ్ మ్యాచ్ (ఎస్ఆర్హెచ్)లతో పాటు తొలి క్వాలిఫయర్ (మే 20), ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్ (మొత్తం 9)లకూ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. గత సీజన్ మాదిరిగానే 2025లోనూ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు (ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండో హోంగ్రౌండ్) జరుగనున్నాయి. ధర్మశాలలో 3 (పంజాబ్‌కు), గువహతిలో 2 (రాజస్థాన్‌కు) మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సీజన్లో మొత్తం 12 డబుల్ హెడర్స్ ఉన్నాయి.
ఐపీఎల్ వేదికలు