ముంబై: అందరూ భావించినట్టుగానే టీమ్ఇండియా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న ‘గ్రేడ్ ఏ+’ కేటగిరీ నుంచి డిమోట్ అయ్యారు. ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ వన్డేలు మాత్రమే ఆడుతున్న నేపథ్యంలో బీసీసీఐ వారి గ్రేడ్‌ను ‘ఏ+’ నుంచి ‘బీ’కి తగ్గించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన 2025-26 వార్షిక కాంట్రాక్టుల్లో మొత్తం 30 మంది క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టును అందించింది.
‘గ్రేడ్ ఏ+’ను పూర్తిగా తొలగించి మూడు గ్రేడ్లుగానే ఆటగాళ్లకు కాంట్రాక్టులను అందజేసింది. టెస్టు, వన్డే సారథి శుభ్‌మన్ గిల్‌తో పాటు బుమ్రా, జడేజా మాత్రమే ‘ఏ’ క్యాటగిరీలో ఉన్నారు. సుందర్, కుల్దీప్, జైస్వాల్, సూర్యకుమార్, శ్రేయాస్ ‘బి’ క్యాటగిరీలోకి రాగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ముకేశ్ కుమార్, పాటిదార్ కాంట్రాక్టులను కోల్పోయారు.
అక్షర్, తిలక్, రింకూ, సంజూ, అర్ష్‌దీప్, సాయి సుదర్శన్ వంటి క్రికెటర్లు గ్రేడ్ ‘సీ’లో ఉన్నారు. మహిళల విభాగంలో 21 మందికి కాంట్రాక్టులు అందజేయగా హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా, దీప్తి శర్మకు గ్రేడ్ ‘ఏ’ దక్కింది.