Saudi T20 League | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సౌదీకి షాక్ ఇచ్చాయి. ఆ దేశ టీ20 లీగ్ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. సౌదీ టీ20 లీగ్‌ను అడ్డుకునేందుకు రెండుదేశాల బోర్డులు నిర్ణయించాయి. ఈ క్రమంలో రెండు బోర్డులు తమ ఆటగాళ్లు సౌదీ టీ20 ఈగ్‌లో పాల్గొనేందుకు ఎన్వోసీ ఇవ్వబోవడం లేదు. సౌదీ టీ20 లీగ్‌లో సుమారు రూ.3,442 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఈ నెలలో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ సందర్భంగా కొత్త లీగ్‌ను వ్యతిరేకించే విషయంలో ఐక్యంగా ఉండాలని ఈసీబీ, బీసీసీఐ అంగీకరించినట్లుగా బ్రిటిష్ వార్త పత్రిక గార్డియన్ ఓ కథనాన్ని ప్రచురించింది. కొత్త టోర్నీలో ఆడాలనుకునే ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOC) జారీ చేయకూడదని రెండు బోర్డులు అంగీకారానికి వచ్చాయి.
ఐసీసీ వద్ద సైతం లాబీయింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ నివేదిక తెలిపింది. మరోవైపు, క్రికెట్ ఆస్ట్రేలియా లీగ్‌లో సౌదీ భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తున్నది. నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియాకు ఆస్ట్రేలియాకు చెందిన ఎస్ఆర్జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కొత్త లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి హామీ ఇచ్చింది. ఇందులో, ఎనిమిది జట్లు ప్రతి సంవత్సరం వేర్వేరు వేదికల్లో నాలుగు టోర్నమెంట్లు ఆడతాయి. దీన్ని టెన్నిస్ గ్రాండ్ స్లామ్‌తో పోలుస్తున్నారు. బిగ్ బాష్ లీగ్ (BBL) ఫ్రాంచైజీలు పాలకమండలి, రాష్ట్రాల యాజమాన్యంలో ఉన్నందున ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి లాభాలను ఆర్జించడంపై సీఎ ప్రధానంగా లక్ష్యం పెట్టుకున్నది. ఇదిలా ఉండగా.. ఐసీసీ చైర్మన్‌గా జై షా కొనసాగుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐకి మద్దతు తెలుపుతారా? లేకపోతే విరుద్ధంగా వెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, లీగ్ విషయంలో జై షా బీసీసీఐ విజ్ఞప్తికి విరుద్ధంగా వెళ్లే అవకాశం లేదని నివేదిక పేర్కొంది.