Gautam Gambhir : భారత పురుషుల జట్టు హెడ్ కోచ్(Head Cocah) పదవిని చేపట్టేది ఎవరు? ఈ ప్రశ్నకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) నియామకం ఖరారైపోయింది. ఐపీఎల్(IPL)లో మెంటార్‌గా విజయవంతమైన గంభీర్ ప్రస్తావించిన అన్ని షరతులకు భారత క్రికెట్ బోర్డు (BCCI) పచ్చ జెండా ఊపేసింది. దాంతో, ఇక గౌతీ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
ఇంతకు గౌతీ కండీషన్స్ ఎంటో తెలుసా..? హెడ్‌కోచ్‌గా తాను ఉండాలంటే.. తనకు నచ్చిన సహాయక సిబ్బంది (Supporting Staff)ని తెచ్చుకునేందుకు అనుమతించాలని గంభీర్ పట్టు పట్టాడు. దాంతో, కాస్త తటపటాయించిన బీసీసీఐ పెద్దలు చివరకు అన్ని షరతులకు అంగీకరించారని సమాచారం. ‘భారత జట్టు కోచ్‌గా ఉండాలని గంభీర్‌తో చర్చలు జరిపాం. టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో గౌతీ సైతం టీమిండియా హెడ్‌కోచ్ పోస్ట్‌పై స్పందించాడు. ‘జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండడం కన్నా గొప్ప గౌరవం మరొకటి లేదు. భారత్‌కు కోచ్‌గా ఉండడాన్ని నేను ఇష్టపడుతాను. విశ్వ వేదికలపై 140 కోట్ల మంది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నేను ప్రతినిధిగా ఉంటాను’ అని గంభీర్ వెల్లడించాడు.
ప్రస్తుతం గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆటగాడిగా గొప్ప రికార్డు ఉన్న గౌతీ.. భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్)లు గెలిచిన జట్టులో సభ్యుడు. అంతేకాదు ఐపీఎల్లో ఏడు సీజన్లు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌గా నిలిచింది. అయితే.. మెంటార్ హిట్ కొట్టిన గంభీర్‌కు కోచ్‌గా ఏమాత్రం అనుభవం లేదు. అయినా సరే ముక్కుసూటి తత్వం, కఠిన నిర్ణయాలు తీసుకొనే నైజం గల అతడు భారత జట్టులో విజయ కాంక్షను రగిలిస్తాడని బీసీసీఐ భావిస్తోంది.
ప్రస్తుతం కోచ్‌గా సేవలందిస్తున్న రాహుల్ ద్రవిడ్(RahulDravid) పదవీ కాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. దాంతో, ఆలోపే కొత్త కోచ్ నియామక ప్రక్రియను చేపట్టాలని బీసీసీఐ భావించింది. తొలుత మాజీ కోచ్ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్‌లు రేసులో ఉంటారనే వార్తలు వినిపించాయి. కానీ, వాళ్లు సంసిద్ధంగా లేకపోవడంతో జై షా బృందం గంభీర్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.