Delhi Water Crisis | దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నీటి సమస్యపై జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సమస్యలపై బీజేపీ నిరసనలను తీవ్రతరం చేసింది. ఆదివారం ఛతర్పూర్ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో జల్‌బోర్డు వద్ద నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు వద్దకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
కుండలు విసరడంతో బోర్డులోని ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. మరో వైపు ద్వారకలో నీటి వివాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ద్వారక జిల్లా పాంత్రంలో సాధారణ కుళాయి నీళాయి వద్ద నీరు పట్టుకునే విషయంలో వివాదం చోటు చేసుకోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈశాన్య ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఢిల్లీలో నీటి కొరతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘మట్కా-ఫోడ్’ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి నెలకొంటుందని.. మంత్రి అతిషి ఎవరిని మోసం చేస్తున్నారన్నారు.
పైప్‌లైన్ మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘వారంతా సోమరిపోతులు.. వారికి ఎలాంటి వ్యూహం లేదు. ఉద్దేశం లేదు. ఖజానాను దోచుకోవడమే వారికి కావాలి’ అని బీజేపీ నేత రమేశ్ బిధూరి విమర్శించారు. ఇది అవినీతి ప్రభుత్వమని.. అవినీతి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ జల్ బోర్డులో ఎలాంటి ఆడిట్ జరుగలేదని.. రూ.70వేలకోట్ల నష్టంలో ఉందన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని డిమాండ్ చేశామన్నారు. ఛతర్‌పూర్‌లోని ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంలో జరిగిన విధ్వంసంపై ఆయన మాట్లాడుతూ.. ఇది సహజమేనని.. ప్రజలు కోపంగా ఉంటే.. ఏదైనా చేయగలరని.. ప్రజలను నియంత్రించిన కార్యకర్తలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
#WATCH | Delhi Jal Board office vandalised by unidentified people in Chhatarpur area. pic.twitter.com/oRzPS0oeNA
— ANI (@ANI) June 16, 2024