కోల్‌కతా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కోహ్లీసేన.. దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ప్రకారం సాగుతుందా లేక మార్పులు ఉంటాయా అనేది తేలనుంది. శనివారం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్) జరుగనుండగా.. సఫారీ టూర్‌తో పాటు పలు కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 24 పాయింట్లపై చర్చ జరుగనుండగా.. ముఖ్యంగా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో మార్పులు చేర్పులపైనే అందరి దృష్టి నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి జొహన్నెస్‌బర్గ్ వేదికగా.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒమిక్రాన్ నేపథ్యంలో పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. టూర్‌ను వారం రోజులు వాయిదా వేయాల్సిందిగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును బీసీసీఐ కోరనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బోర్డు పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి!