BCCI-Agarkar | భారత జట్టు మెన్స్ క్రికెట్ టీం సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్‌ని బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉన్న పోస్టులను ఎట్టకేలకు బీసీసీఐ మంగళవారం భర్తీ చేసింది. ఇంతకు మందు చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగిన చేతన్ శర్మ ఓ టీవీ న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేయడంతో తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి శివసుందర్ దాస్‌ను తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, అజిత్ అగార్కర్‌ను చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిందనే విమర్శలు వచ్చాయి.
అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కమిటీలో ఇప్పటికే సుబ్రొతో బెనర్జీ (ఈస్ట్ జోన్), ఎస్ శరత్ (సౌత్ జోన్), శివసుందర్ దాస్ (ఈస్ట్ జోన్), సలీల్ అంకోలా (వెస్ట్ జోన్) ఉన్నారు. అగార్కర్ స్వస్థలం వెస్ట్ వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఒకే జోన్ నుంచి ఇద్దరు సెలెక్టర్లు కొనసాగుతున్నారు. వెస్ట్ జోన్ నుంచి సలీల్ అంకోలా తర్వాత అగార్కర్ ఎంపికయ్యాడు. నార్త్ జోన్, సెంట్రల్ జోన్ నుంచి ఎవరూ లేరు. వాస్తవానికి అన్ని ప్రాంతాల నుంచి సెలెక్టర్లు ఉండాలి. కానీ, నార్త్, సెంట్రల్ జోన్ నుంచి ఎవరూ సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకోలేదు.
ఈ పరిస్థితుల్లో ఐదు జోన్ల నుంచి ఐదుగురు సెలెక్టర్లను నియమించే పాత పద్ధతిని పక్కన పెట్టడం తప్ప బీసీసీఐకి మరోమార్గం లేకపోయింది. లోధా కమిటీ సిఫారసుల మేరకు ఈశాన్య జోన్‌ను ఏర్పాటు చేశారు. ఒక ప్రాంతం నుంచి ఇద్దరు సెలక్టర్లను ఎంపిక చేయడంలో భారత క్రికెట్ బోర్డు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎం లోధా కమిటీ సిఫారసుల ప్రకారం.. తయారైన బీసీసీఐ రాజ్యాంగంలో ప్రాంతీయ ప్రాతిపదికన సెలెక్టర్ల నియమానికి సంబంధించి అలాంటి నియమం లేదని, ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నాయి.
వాస్తవానికి లోధా కమిటీ ముగ్గురు సెలెక్టర్లను మాత్రమే ఉండాలని సిఫారసు చేసింది. అయితే, దీన్ని బీసీసీఐ అంగీకరించలేదు. ఐదుగురు సెలెక్టర్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. జూన్ 22న సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. ఇందులో ఏ జోన్ నుంచి దరఖాస్తు చేసుకోవాలో మాత్రం పేర్కొనలేదు. చీఫ్ సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి కనీసం ఏడు టెస్టులు, లేదంటే 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడిన అనుభవం ఉండాలని ప్రకటనలో పేర్కొంది.
అలాగే, ఆ ఆటగాడు ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యి ఉండాలనే నిబంధన విధించింది. బీసీసీఐ చాలా సంవత్సరాలుగా వివిధ జోన్లకు సమ ప్రాధాన్యం కల్పించింది. ఇదిలా ఉండగా.. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక చేయనున్నది. సెలక్షన్ కమిటీ సమావేశం ఈ వారం చివరలో జరుగనున్నది. వెస్టిండీస్‌లో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.