SMAT : సంచలనాలకు నెలవైన పొట్టి క్రికెట్లో మరో రికార్డు బద్ధలైంది. టీ20ల్లో అరంగేట్రంలోనే బరోడా క్రికెటర్ అమిత్ పస్సీ (Amit Passi) రికార్డు సెంచరీ బాదేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) తొలి మ్యాచ్‌లోనే అత్యధిక స్కోర్‌తో చరిత్ర సృష్టించాడీ యువకెరటం. సోమవారం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన అమిత్.. 44 బంతుల్లోనే సెంచరీతో రఫ్ఫాడించాడు. ఈ టోర్నీలో ఆడిన మొట్టమొదటి మ్యాచ్‌లోనే శతకం సాధించిన మూడో ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడీ బరోడా కుర్రాడు.
దేశవాళీ టోర్నీల్లో ఒకటైన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఏడాది రికార్డుల మోత మోగుతోంది. ఆకలిమీదున్న సింహాల్లా కుర్రాళ్లు సెంచరీలతో చెలరేగిపోతున్నారు. యువకెరటం వైభవ్ సూర్యవంశీ సెంచరీతో మెరవగా.. ఇప్పుడు బరోడా క్రికెటర్ అమిత్ పస్సీ రికార్డు శతకంతో చరిత్రకెక్కాడు. స్మాట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే వంద కొట్టిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు అమిత్. అతడి కంటే ముందు పంజాబ్ ఆటగాడు శివం బాంబ్రీ, హైదరాబాదీ బ్యాటర్ అక్షత్ రెడ్డిలు మూడంకెల స్కోర్ బాదారు. అక్షత్ 2010లో ముంబైపై 105 రన్స్ చేయగా.. 2019లో హిమాచల్ ప్రదేశ్‌పై 106 పరుగులతో అదరగొట్టాడు.
🚨 Record Alert 🚨
Amit Pasi registers the highest individual score on debut in #SMAT history with 1⃣1⃣4⃣(55) for Baroda against Services in Hyderabad 🙌
He also becomes just the third batter to score a century on debut in the tournament. 👏
Scorecard ➡️… pic.twitter.com/rwklmUfrBo
— BCCI Domestic (@BCCIdomestic) December 8, 2025
సర్వీసెస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అమిత్ 44 బంతుల్లోనే శతకం సాధించాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో విరుచుకుపడిన ఈ యంగ్‌స్టర్ 24 బంతుల్లో అర్ధ శతకం కొట్టాడు. ఆ తర్వాతి 20 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడీ హిట్టర్. అంతేకాదు టీ20ల్లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ బాదిన పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ అసిఫ్ రికార్డు సమం చేశాడు అమిత్. ఈ చిచ్చరపిడుగు విజృంభణతో బరోడా 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.