దుబాయ్: భారత సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఓటములతో పాటు అండర్-19 స్థాయిలోనూ టీమ్ఇండియా అభిమానులకు నిరాశ తప్పలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఏసీసీ అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోనూ యువ భారత్‌కు పరాభవం తప్పలేదు. భారత్‌ను 59 పరుగుల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ ఆసియా అండర్-19 విజేతగా నిలిచింది. బౌలర్లు రాణించినా బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమ్ఇండియా రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బంగ్లాదేశ్‌ను 49.1 ఓవర్లలో 198 పరుగులకే నిలువరించింది. యుధజిత్ గుహ (2/29), చేతన్ శర్మ (2/48), హార్దిక్ రాజ్ (2/41) బంగ్లాను కట్టడిచేశారు. ఆ జట్టులో రిజాన్ హోసన్ (47) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత కుర్రాళ్లు తడబాటుకు లోనై 35.2 ఓవర్లలో 139 పరుగులకే పరిమితమయ్యారు. భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా 30 పరుగుల వ్యక్తిగత స్కోరును నమోదుచేయలేదు. కెప్టెన్ మహ్మద్ (26), 13 ఏండ్ల కుర్రాడు సూర్యవంశీ (9), సిద్ధార్థ్ (20) విఫలమయ్యారు.