బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. సొంతగడ్డపై సత్తాచాటుతూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌పై మరింత పట్టు సాధించింది. అశ్విన్ సూపర్ సెంచరీకి తోడు జడేజా యాంకర్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు అందుకున్న భారత్..బంగ్లా భరతం పట్టింది. యార్కర్కింగ్ బుమ్రా నాలుగు వికెట్ల విజృంభణకు తోడు ఆకాశ్‌దీప్, సిరాజ్, జడేజా రాణించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. వెటరన్ షకీబ్ అల్హసన్(32) టాప్ స్కోరర్‌గా నిలువగా సహచర బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.
బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 81 పరుగులతో కొనసాగుతున్నది. కెప్టెన్ రోహిత్‌శర్మ(5), విరాట్ కోహ్లీ(17) మరోమారు నిరాశపర్చగా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న భారత్ ప్రస్తుతం 308 పరుగుల భారీ ఆధిక్యంలో ఉన్నది.మూడు రోజులు మిగిలున్న మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప.. భారత్ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం!
చెన్నై: భారత పేసర్లు విజృంభించడంతో చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పటిష్ట స్థితిలో నిలిచింది. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (4/50) నాలుగు వికెట్లతో బంగ్లా వెన్ను విరవగా యువ పేసర్ ఆకాశ్ దీప్ (2/19), మహ్మద్ సిరాజ్ (2/30)కు తోడు స్పిన్నర్ రవీంద్ర జడేజా (2/19) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 47.1 ఓవర్లలో 149 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టులో షకీబ్ అల్హసన్ (32) టాప్ స్కోరర్. బంగ్లాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్.. 227 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన.. 23 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (33 బ్యాటింగ్), రిషభ్ పంత్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 308 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.
గంటలోపే ఆలౌట్
ఓవర్ నైట్ స్కోరు 339/6తో రెండో రోజు ఆరంభించిన భారత్ మరో 37 పరుగులు మాత్రమే జోడించి ఫస్ట్ సెషన్లో గంటలోపే ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగూ జోడించకుండానే జడేజా (86) వెనుదిరగగా సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్ (113) మరో 11 పరుగులు జతచేశాడు. ఆకాశ్ దీప్ (17) నాలుగు బౌండరీలతో మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేసింది. యువ బౌలర్ హసన్(5/83) ఐదు వికెట్లతో అదరగొట్టాడు.
వణికించిన పేసర్లు
భారత సీమర్ల ధాటికి బంగ్లా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ షాద్మన్ (2) క్లీన్ బౌల్డ్ ఔట్ అయ్యాడు. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన అతడు.. ఆఫ్ స్టంప్‌ను వదిలేసి ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఆకాశ్ దీప్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో జకీర్ హసన్ (3), మోమినుల్ హక్ (0)ను ఔట్ చేశాడు. లంచ్ విరామ సమయానికి బంగ్లా స్కోరు 9 ఓవర్లలో 26/3గా ఉంది. లంచ్ తర్వాత సిరాజ్ వేసిన 12వ ఓవర్లో కెప్టెన్ నజ్ముల్ శాంతో (20) స్లిప్స్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. ప్రమాదకర ముష్ఫీకర్ రహీమ్ (8) సైతం బుమ్రా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను షకిబ్, లిటన్ దాస్ (22) ఆదుకునే యత్నం చేశారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కానీ జడేజా రంగప్రవేశంతో రోహిత్ వీరి ఆట కట్టించాడు. జడ్డూ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ఆడబోయిన దాస్.. డీప్ స్కేర్ లెగ్ వద్ద సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ధ్రువ్ జురెల్ చేతికి చిక్కాడు. అతడి బౌలింగ్‌లోనే రివర్స్ స్వీప్ ఆడబోయిన షకిబ్.. రిషభ్ పంత్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. మిరాజ్ ఆదుకున్నా అతడికి అండగా నిలిచే బ్యాటర్ లేకపోవడంతో ఆ జట్టు 149కే ఆలౌట్ అయింది.
భారీ ఆధిక్యం దిశగా..
తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో మరోసారి తడబడింది. రోహిత్ (5) మళ్లీ నిరాశపరచగా మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన యశస్వీ జైస్వాల్ (10) కూడా విఫలమయ్యాడు. గిల్‌తో కలిసి క్రీజులో నిలదొక్కుకున్నట్టే కనిపించిన కోహ్లీ (17) అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా బలయ్యాడు. మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన కోహ్లీ.. డీఆర్ఎస్ తీసుకోకుండానే క్రీజును వీడాడు. కానీ రిైప్లెలో బంతి కోహ్లీ బ్యాట్‌ను తాకుతూ వెళ్లినట్టుగా కనిపించింది. గిల్, పంత్‌తో పాటు రాహుల్, అశ్విన్, జడేజా వంటి బ్యాటర్లు క్రీజులో ఉండటంతో భారత్ 400 ప్లస్ ఆధిక్యంపై కన్నేసింది! మొత్తంగా రెండో రోజు ఆటలో ఏకంగా 17 వికెట్లు నేలకూలడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో హసన్
మహ్ముద్ను ఔట్ చేయడంతో టెస్టులలో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పూర్తి చేసిన పదో భారత బౌలర్ (పేసర్లలో ఆరోవాడు)గా నిలిచాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 376 ఆలౌట్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్:149 ఆలౌట్ (షకిబ్ 32, మిరాజ్ 27 నాటౌట్, బుమ్రా 4/50, ఆకాశ్ 2/19) భారత్ రెండో ఇన్నింగ్స్ :81/3 (గిల్ 33 నాటౌట్, పంత్ 12 నాటౌట్)