Nigar Sultana | బంగ్లాదేశ్ మహిళా క్రికెట్లో పెను వివాదం చెలరేగింది. కెప్టెన్ నిగర్ సుల్తానా జూనియర్ ఆటగాళ్లను దుర్భాషలాడుతూ, దాడి చేస్తుందని ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జహానారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశంతో కూడినవంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ఆరోపణలను కొట్టిపడేసింది. బంగ్లాదేశ్ వార్తాపత్రిక కలేర్ కాంతోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహానారా ఆలం అనేక పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిగర్కు ఇదేం కొత్త కాదని. జూనియర్ ఆటగాళ్లను వేధించడంతో పాటు చెంపదెబ్బలు కొడుతుందని మండిపడింది.
ప్రపంచకప్ సమయంలోనూ, దుబాయి పర్యటనలోనూ కెప్టెన్ నిగర్ జూనియర్‌ను గదిలోకి పిలిచి చెంపదెబ్బ కొట్టిందని ఆరోపించింది. జట్టు వాతావరణం క్రమంగా విషపూరితంగా మారుతోందని జహానారా ఆలం పేర్కొంది. 2024లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సమయంలో తాను తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, దాంతో రెండు నెలల విరామం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. బంగ్లాదేశ్ జట్టులో దాదాపు ప్రతీ ప్లేయర్ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారని.. ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు ఎక్కువ సౌకర్యాలు పొందుతారని.. మిగిలిన వారిని విస్మరిస్తున్నట్లుగా తెలిపింది. సీనియర్స్‌ను తొలగించే ప్రక్రియ 2021లో ప్రారంభమైందని.. తనను క్రమంగా జట్టు నుంచి తప్పించారని జహరానా ఆరోపించింది.
అయితే, ఆరోపణలను బంగ్లా క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది. ఆరోపణలన్నీ నిరాధారమని, దురుద్దేశంతో చేసినవేనని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో జట్టు రాణిస్తున్న సమయంలో ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు నిరాశపరిచాయని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ క్రికెట్ ఇకపై ఎలాంటి సంబంధం లేని ఓ క్రీడాకారిణి ఇలాంటి తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, వివాదంపై కెప్టెన్ నిగర్ సుల్తానా స్పందించలేదు. ఈ ఆరోపణలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, మహిళా క్రికెట్ ఇమేజ్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జట్టు నాయకత్వం, ప్లేయర్స్, సహాయక సిబ్బందిపై పూర్తి విశ్వాసం ఉందని.. ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని బీసీబీ చెప్పుకొచ్చింది.