మౌంట్ మౌంగనీ: బంగ్లాదేశ్ జట్టు అద్భుతం చేసింది. ఏండ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్‌ను మట్టికరిపిస్తూ తొట్టతొలి విజయాన్ని ముద్దాడింది. వారి సొంతగడ్డపైనే కివీస్‌కు చెక్ పెడుతూ కొత్త చరిత్ర లిఖించింది. దీని ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో బంగ్లా విజయదుందుభి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కివీస్ నిర్దేశించిన 40 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మోమినుల్ హక్(13 నాటౌట్), ముష్పికర్ రహీమ్(5 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు(147/5)తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్.. ఇబాదత్ హుస్సేన్(6/46) విజృంభణతో 169 పరుగులకు కుప్పకూలింది. సీనియర్ రాస్ టేలర్(40) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఇబాదత్..కివీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. తస్కిన్ అహ్మద్(3/36) మూడు వికెట్లు దక్కాయి. ఏడు వికెట్లతో జట్టు విజయంలో కీలకమైన హుస్సేన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లలో (43 మ్యాచ్‌లు) బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం
న్యూజిలాండ్‌పై 16 ప్రయత్నాల్లో బంగ్లా మొదటిసారి విజయం సాధించింది.
ఐసీసీ టాప్-5 ర్యాంక్‌ల్లో ఉన్న జట్టుపై విదేశాల్లో బంగ్లా గెలువడం ఇది తొలిసారి
విదేశాల్లో ఆడిన 61 టెస్టుల్లో బంగ్లాకు ఇది ఆరో విజయం
స్వదేశంలో న్యూజిలాండ్ వరుసగా 17 టెస్టు మ్యాచ్‌ల జైత్రయాత్రకు బంగ్లా బ్రేక్ వేసింది