Asia Cup 2025 : బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ (Asia Cup 2025) కోసం సన్నాహకాలు షురూ చేసింది. మెగా టోర్నీకి ముందు స్వదేశంలో నెదర్లాండ్స్(Netherlands)తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది బంగ్లా. దాంతో, ఈ సిరీస్‌తో పాటు ఆసియా కప్‌ను దృష్టిలో ఉంచుకొని మంగళవారం సెలెక్టర్లు ప్రిలిమినరీ స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. లిటన్ దాస్ సారథిగా 25 మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. వికెట్ కీపర్ నురుల్, మాజీ కెప్టెన్ శాంటోలకు చోటు దక్కింది.
డచ్ జట్టుపై సిరీస్ విజయంతో ఆసియా కప్ పోటీలకు ఆత్మ విశ్వాసంతో వెళ్లాలనుకుంటోంది బంగ్లాదేశ్. ఈ సిరీస్ ముగియడమే ఆలస్యం.. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ మొదలవ్వనుంది. ‘అందుబాటులో ఉన్న క్రికెటర్లు ఆగస్టు 6లోపు మిర్పూర్లోని ఫిట్నెస్ క్యాంప్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి నైపుణ్య శిక్షణ కొనసాగనుంది.
ఆగస్టు 20 నాటికి క్యాంప్ సిల్హెట్‌కు తరలిపోనుంది’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మూడు టీ20ల సిరీస్ కోసం నెదర్లాండ్స్ జట్టు ఆగస్టు 26న బంగ్లాకు రానుంది. ఆగస్టు 30న మొదటి మ్యాచ్, సెప్టెంబర్ 1న రెండో టీ20, సెప్టెంబర్ 3న మూడో మ్యాచ్ జరుగనున్నాయి.
ఆసియా కప్ తాత్కాలిక స్క్వాడ్ : లిటన్ దాస్(కెప్టెన్), తంజిద్ హసన్, నయీం షేక్, సౌమ్యా సర్కార్, మహ్మద్ పర్వేజ్ హొసేన్, తౌహిద్ హృదొయ్, జకీర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హొసేన్, నజ్ముల్ హుసేన్ శాంటో, రిషద్ హొసేన్, షక్ మహెదీ హసన్, తన్వీర్ ఇస్లాం, నసుం అహ్మద్, హసన్ మహ్ముద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్, షొరిఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, ఖాజీ నురుల్ హసన్, మహిదుల్ ఇస్లాం, మహ్మద్ సైఫ్ హసన్.