అబుదాబి: ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోరు అభిమానులను అలరించింది. మంగళవారం ఆఖరి దాకా ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సూపర్-4 రేసులో నిలిచింది. బంగ్లా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గన్ 20 ఓవర్లలో 146 స్కోరుకు ఆలౌటైంది. గుర్బాజ్ (35), ఒమర్జాయ్ (30) రాణించినా మిగతావారు విఫలమయ్యారు. ఇన్నింగ్స్ తొలి బంతికి సెదికుల్లా (0) ఔట్ కాగా, ఇబ్రహీం(5), నయిబ్ (16), నబి (15), కరీమ్ (6) విఫలమయ్యారు. ముస్తాఫిజుర్ (3/28), నసుమ్ (2/11), రిశాద్(2/18), తస్కిన్(2/34) రాణించారు. గెలుపు కోసం కడదాకా ప్రయత్నించిన అఫ్గన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి వైపు నిలిచింది. గ్రూపు-బీలో ప్రస్తుతం శ్రీలంక(4), బంగ్లాదేశ్(4), అఫ్గానిస్థాన్(2) టాప్-3లో ఉండగా, హాంకాంగ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్..బ్యాటింగ్ వైపు మొగ్గుచూపింది. ఓపెనర్లు తంజిద్ హసన్(52), సైఫ్ హసన్(30) బంగ్లాకు మెరుగైన శుభారంభం అందించారు. అఫ్గన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సున్నా పరుగుల వద్ద ఫజుల్లా బౌలింగ్‌లో హసన్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీన్ని అవకాశంగా మలుచుకుంటూ హసన్, తంజిద్ బ్యాట్లకు పనిచెప్పారు. ఫజుల్లా మూడో ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన తంజిద్..ఎల్బీడబ్ల్యూపై అంపైర్ కాల్‌తో బతికి పోయాడు. ఒక రకంగా ఇద్దరు ఔట్లను తప్పించుకుని బౌండరీలతో ఆకట్టుకున్నారు.
అఫ్గన్ బౌలర్లను ఏ మాత్రం కుదరుకోనివ్వని తంజిద్..ఆరవ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లా వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన కెప్టెన్ రషీద్‌ఖాన్ తన తొలి ఓవర్లోనే సైఫ్ హసన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి అఫ్గన్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. హసన్ ఔట్‌తో తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ లిటన్‌దాస్(9) స్వల్ప స్కోరుకే నిష్క్రమించాడు.
ఈ క్రమంలో తౌహిద్ హృదయ్(26)తో కలిసి తంజిద్ బ్యాటింగ్ కొనసాగించాడు. 28 బంతుల్లో తంజిద్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న తంజిద్‌ను నూర్ అహ్మద్ ఔట్ చేయడంతో మ్యాచ్ అఫ్గన్ వైపు తిరిగింది. మిడిల్ ఓవర్లలో అఫ్గన్ స్పిన్నర్లు..బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆఖర్లో షమీమ్ (11), జేకర్ అలీ(12 నాటౌట్), నురుల్ హసన్(12 నాటౌట్) ఆకట్టుకున్నారు. రషీద్‌ఖాన్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు.
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 154/5(తంజిద్ 52, హసన్ 30, నూర్ 2/23, రషీద్ 2/26),
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 146 ఆలౌట్(గుర్బాజ్ 35, ఒమర్జాయ్ 30, ముస్తాఫిజుర్ 3/28, నసుమ్ 2/11)