Bajrang Punia | భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కుస్తీ వీరులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ నిరసనల్లో తాజాగా స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా పాల్గొని మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు.
‘అథ్లెట్లు ప్రాక్టీస్ పక్కనపెట్టి ఇక్కడ నిసనల్లో కూర్చోవలసి రావడం చాలా బాధాకరం. మా ఈ ఉద్యమం భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా మాత్రమే. మా సమస్యలను పరిష్కరించి డిమాండ్లను నెరవేర్చాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పునియా అన్నారు.
మరోవైపు రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. యువ మహిళా రెజ్లర్లపైన కూడా బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక మంది ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో తెలిపారు.