Bajrang Punia : భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియా (Bajrang Punia) హైకోర్టును ఆశ్రయించాడు. ఈమధ్యే రాజకీయాల్లో అడుగు పెట్టిన బజ్రంగ్ తనపై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (NADA) విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో, ధర్మసనం అతడి అభ్యర్థనపై విచారణ చేపట్టనుంది. త్వరలోనే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్స్(World Wrestling Championships) పోటీలు మొదలవ్వనున్నాయి. ఈ నేపథ్యంలోనే బజ్రంగ్ తనపై నిషేధం ఎత్తేయాలని హైకోర్టుకు వెళ్లాడు. త్వరలోనే అతడిపై సస్పెన్షన్ తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ సమయంలో డ్రగ్ పరీక్షల కోసం మూత్రం నమూనా ఇచ్చేందుకు బజ్రంగ్ నిరాకరించాడు. దాంతో, నాడా అతడిపై నిషేధం విధించింది. అందువల్ల బజ్రంగ్ పారిస్ విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. ఈమధ్యే బజ్రంగ్ మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat)తో కలిసి కాంగ్రెస్లో చేరాడు. అనంతరం వీళ్లిద్దరూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా న హర్యానాలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బజ్రంగ్, పూనియాలు పోటీ చేసే అవకాశముంది.
బజ్రంగ్, వినేశ్ ఫొగాట్
నిరుడు రెజ్లింగ్ సమాఖ్య మాజీ ఆధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన పూనియా.. 65 కిలోల విభాగంలో తన పట్టు కోల్పోయాడు. వరుసగా ఆసియా చాంపియన్షిప్స్, ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్లో అతడు టాప్ 4లో చోటు దక్కించుకోలేకపోయాడు. దానికి తోడూ డ్రగ్ పరీక్షల కోసం అతడు తన యూరిన్ శాంపిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో, నాడా అతడిపై నిషేధం విధించింది.
ఇక వినేశ్ పారిస్ ఒలింపిక్స్లో అనూహ్యంగా పతకం చేజార్చుకుంది. 51 కిలోల విభాగంలో ఫైనల్కు ముందు 100 గ్రాముల అదనపు బరువు వల్ల ఆమె అనర్హతకు గురైంది. ఆ తర్వాత క్రీడా కోర్టులో తనకు రజతం ఇవ్వాలని అప్పీల్ చేసినా కూడా ఆమెకు ఊరట లభించలేదు.