అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. షటిల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న భారత్.. కామన్వెల్త్ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. మహిళల సింగిల్స్‌లో సింధు.. పురుషుల విభాగంలో శ్రీకాంత్, లక్ష్యసేన్.. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ.. ఇలా స్టార్లతో బరిలోకి దిగుతున్న భారత్.. బర్మింగ్‌హామ్‌లో రచ్చ చేసేందుకు రెడీ అయింది. గోల్డ్ కోస్ట్‌లో ఆరు పతకాలతో అదుర్స్ అనిపించిన మన షట్లరు ఈసారి అంతకుమించిన ప్రదర్శన నమోదు చేయాలని చూస్తున్న నేపథ్యంలో కామన్వెల్త్లో మన పతకావకాశాలపై ప్రత్యేక కథనం..
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ఇటు వ్యక్తిగతంగా.. అటు జట్టు పరంగా ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించిన భారత షట్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌కు రెడీ అయ్యారు. కెరీర్లోనే తొలిసారి సింగపూర్ ఓపెన్ నెగ్గి పీవీ సింధు జోరుమీదుంటే.. ప్రతిష్ఠాత్మక థామస్ కప్ విజయంతో పురుషుల టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. గోల్డ్‌కోస్ట్ (2018) వేదికగా జరిగిన గత కామన్వెల్త్ క్రీడల్లో మనవాళ్లు రెండు స్వర్ణాలు సహా ఆరు పతకాలు సాధించి బెస్ట్ నేషన్‌గా నిలువగా.. ఇప్పుడు అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని చూస్తున్నారు.
దేశం తరఫున కామన్వెల్త్ క్రీడల్లో దినేశ్ ఖన్నా తొలి పతకం (కాంస్యం, 1966లో) గెలుచుకోగా.. భారత్ ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో మొత్తం 25 మెడల్స్ (7 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్యాలు) చేజిక్కించుకుంది. సింగిల్స్‌లో సింధు, శ్రీకాంత్, లక్ష్యసేన్‌పై భారీ ఆశలు ఉండగా.. గోల్డ్‌కోస్ట్ పురుషుల డబుల్స్‌లో రజతం నెగ్గిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఈసారి పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ భారత్ సత్తాచాటుతుందా చూడాలి. మనవాళ్లకు ముఖ్యంగా మలేషియా, బ్రిటన్ షట్లర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్‌తో కలిసి గ్రూప్-1లో ఉన్న భారత్.. నాకౌట్ చేరడం ఖాయమే కాగా.. క్వార్టర్స్ నుంచి మన షట్లర్లకు అసలు పోటీ ఎదురుకానుంది. థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాత్విక్-చిరాగ్ ద్వయంపై భారీ ఆశలు ఉండగా.. మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత షట్లర్లు.. కామన్వెల్త్ క్రీడల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన క్రీడల్లో ఇంగ్లండ్ 109 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. మలేషియా 64 మెడల్స్‌తో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నది. 7 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 25 మెడల్స్ ఖాతాలో వేసుకున్న భారత్ మూడో స్థానంలో ఉంది.