Babar Azam : టీ20 వరల్డ్ కప్‌లో దారుణమైన ఆటతో విమర్శలపాలైన పాకిస్థాన్(Pakistan) టోర్నీని విజయంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఓదార్పు విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మెగా టోర్నీలో పాక్ వైఫల్యంపై కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) మాట్లాడాడు. ‘మా జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ, సమిష్ఠిగా మేము మంచి ప్రదర్శన చేయలేకపోయాం’ అని పాక్ సారథి తెలిపాడు. అంతేకాదు తన కెప్టెన్సీపై కూడా బాబర్ స్పందించాడు.
‘ఒకవేళ నేను పాక్ కెప్టెన్‌గా వైదొలగాల్సి వస్తే.. ఆ విషయాన్ని బహిరంగంగా అందరికీ చెప్తాను. అంతేకానీ, రహస్యంగా మాత్రం ఉంచను. ఏది అయినా మీ ముందే జరుగుతుంది. అందుకని నేను ఆ విషయం మాట్లాడదలుచుకోవడం లేదు. నన్ను కెప్టెన్‌గా ఉంచాలా? వద్దా? అనేది పీసీబీ(PCB) చేతుల్లో ఉంది’ అని బాబర్ వెల్లడించాడు. నిరుడు వన్డే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ వదులకున్న బాబర్.. టీ20 ప్రపంచకప్ ముందు మళ్లీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
రెండో సీజన్ చాంపియన్.. ఎనిమిదో సీజన్ రన్నరప్ అయిన పాకిస్థాన్ ఈసారి ఘోరంగా చతికిలపడింది. పసికూన అమెరికా(USA) చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించిన పాక్.. తర్వాత టీమిండియా(Team India)పై చేజేతులా ఓడింది. ఎట్టకేలకు కెనడాపై విజయంతో పాయింట్ల ఖాతా తెరిచినా బాబర్ సేన సూపర్ 8కు చేరలేకపోయింది. అనిశ్చితికి మారుపేరైన పాక్ మెగా టోర్నీలో సమిష్టిగా ఆడలేకపోయింది.
జట్టులో ఐక్యత లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్టుగా ఉండడం ఆ జట్టును ముంచింది. కెప్టెన్‌గా విఫలైమన బాబర్ ఆటగాడిగానూ సత్తా చాటలేకపోయాడు. మొత్తంగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పాక్ సారథి 40.62 సగటుతో 122 రన్స్ కొట్టాడంతే. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మినహా ఏ ఒక్కరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్ యూనిట్ రాణించినా బ్యాటర్ల వైఫల్యంతో పాకిస్థాన్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.