Axar Patel | దుబాయ్: పదకొండేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా ఏడాదిన్నర క్రితం వరకూ రవీంద్ర జడేజా నీడన మరుగున పడిపోయిన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. ఇప్పుడు అతడి వారసుడిగా ఎదగడమే కాకుండా మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధారణంగా ఈ స్థానంలో అద్భుతమైన రికార్డు కలిగిన కేఎల్ రాహుల్‌ను వెనక్కి జరిపి మరీ అక్షర్‌ను ముందుకు పంపడం సాహసమే అయినప్పటికీ తనకు అప్పజెప్పిన బాధ్యతలకు అతడు వంద శాతం న్యాయం చేస్తున్నాడు.
పంత్ వైఫల్యంతో టాపార్డర్‌లో ఎడమ చేతివాటం బ్యాటర్ లేకపోవడం జట్టు కూర్పును దెబ్బతీస్తున్న తరుణంలో మేనేజ్మెంట్.. ఆ సమస్యకు అక్షర్ రూపంలో చెక్ పెట్టేందుకు ఈ ప్రయోగం చేసింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 52, 41 నాటౌట్, 13తో మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అక్షర్.. అటు బంతితో పాటు బ్యాట్‌తోనూ అంచనాలకు మించి రాణిస్తూ మిడిలార్డర్ కష్టాలకు చెక్ పెడుతున్నాడు.
వాస్తవానికి 2014లోనే భారత్ తరఫున వన్డేలలో ఎంట్రీ ఇచ్చిన అక్షర్‌కు జడేజా నీడలో సరైన గుర్తింపు రాలేదు. జడ్డూ లాగే స్లో లెఫ్టార్మ్ స్పిన్, లోయరార్డర్లో బ్యాటింగ్ చేసే అక్షర్.. 2022లో వెస్టిండీస్‌తో బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌తో తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ మ్యాచ్‌లో అక్షర్.. 66 బంతుల్లో 3 బౌండరీలు, ఐదు భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డేలలో అతడికి అదే తొలి అర్ధ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తోనే తాను ఫినిషర్ కాగలనన్న ధైర్యం వచ్చిందని అక్షర్ గతంలో ఓసారి వ్యాఖ్యానించాడు. దీంతో గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనే అక్షర్.. ఐదో స్థానానికి ప్రమోట్ అయ్యాడు. ఆ సిరీస్‌లో 33, 44 స్కోర్లతో ఫర్వాలేదనిపించాడు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌లో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో అతడు ఆడిన తీరుకు కోచ్ గంభీర్, సారథి రోహిత్ ఫిదా అయ్యారు. రాహుల్‌ను వెనక్కి నెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా వాటిని లెక్కచేయకుండా అక్షర్‌ను ప్రమోట్ చేసి విమర్శలకు ఆటతీరుతోనే చెక్ పెడుతున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 30 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి అక్షర్ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. రోహిత్, గిల్, కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట.. కీలకమైన 42 పరుగులు చేసి శ్రేయాస్‌తో ఐదో వికెట్‌కు 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యంతో భారత్ 249 పరుగుల పోరాడే స్కోరును సాధించింది. బ్యాట్‌తో మెరిసిన అక్షర్.. ఆ తర్వాత బంతితో 10 ఓవర్లలో 32 పరుగులే ఇచ్చి తన స్పెల్‌లో లాస్ట్ బాల్‌కు ప్రమాదకర కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేశాడు. విలియమ్సన్ అప్పటికే 81 పరుగులు చేసి ఆ జట్టును విజయపథం వైపు నడిపిస్తుండగా అక్షర్ అతడిని ఔట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో అక్షర్ ప్రదర్శనను ఎవరూ పట్టించుకోలేదు. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాతోనూ అక్షర్ ఆల్‌రౌండ్ షోతో టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.