బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్): వెస్టిండీతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. మూడు రోజుల్లోనే ముగిసిన మొదటి టెస్టులో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆసీస్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 33.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. స్టార్ పేసర్ హాజిల్‌వుడ్(5/43) ధాటికి విండీస్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ హాజిల్‌వుడ్ స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. షామర్ జోసెఫ్(44), జస్టిన్ గ్రీవ్స్(38) తప్పా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 92/4తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 310 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్లో ట్రావిస్ హెడ్(61), వెబ్‌స్టర్(63), అలెక్స్ క్యారీ(65) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. షామర్ జోసెఫ్(5/87) ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలు చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.